
ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ క్రేజే వేరు. ఆయన కీర్తి బాహుబలితో బాలీవుడ్ కు పాకింది. నార్త్ ,సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు గర్వపడేలా దేశం మొత్తం చూసే ఓ పాటలో కనిపించారు. వివరాల్లోకి వెళితే...
ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా.. పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాని ఆగస్ట్ 15వ తేదీన ఎగురవేసేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, ప్రతి ఇంటిపైనా జెండా ఎగురవేసేందుకు వీలుగా, ఇంటింటికీ జాతీయ జెండాల్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని జెండాల్ని రాష్ట్రాలకు సమకూర్చనుంది. ఆ ప్రమోషన్స్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా.. అంటూ ఓ వీడియో సాంగ్ రూపొందించారు.
అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్ తదితరులు ఈ వీడియోలో కనిపించారు. సౌత్ సినిమా నుంచి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే కనిపించగా, హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కనిపించడం గమనార్హం. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ వీడియోలో వున్నాడు. క్రికెటర్ విరాట్ కోహ్లీ సహా మరికొందరు టీమిండియా క్రికెటర్లు, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తదితరుల్ని కూడా వీడియోలో చూడొచ్చు.