
దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) క్రేజీ ప్రాజెక్ట్ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కావస్తుండటంతో మేకర్స్ మాస్ అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. రేపు సాయంత్రం ‘వాల్తేరు వీరయ్య’ నుంచి మాస్ నెంబర్ గా ‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదల కానుంది. తాజాగా విడుదలై ప్రోమోతో సాంగ్ పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సాంగ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం విశేషం.
ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ హైదరాబాద్‌లోనే చిత్రీకరణను కొనసాగుతోంది. ఫస్ట్ సాంగ్ విడుదల సందర్భంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి వాల్తేరు వీరయ్య సెట్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా రేపు అధికారికంగా విడుదల కానున్న Boss Party ఫుల్ సాంగ్ ను చూసి పాజిటివ్ కామెంట్స్ చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందని, ట్యూన్, లిరిక్స్ పై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు బాబీ (Bobby) తన ట్వీటర్ వేదికన వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప క్షణం ఇది. నాకు నచ్చిన ఇద్దరు మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా పక్కనే ఉండటం. కళ్యాణ్ గారు #BossParty పాటను చూశారు. చాలా ఇష్టపడ్డారు. ఇన్నేండ్లైయినా పవన్ లోని ప్రేమ, సానుకూల ఒకేలా ఉండటం స్ఫూర్తిదాయకంగా ఉంద’ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా
పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి పాటను చూస్తున్న చిత్రాలను, వారితో దిగిన ఫొటోను బాబీ అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు పూర్తి పాట రిలీజ్ కానుంది. బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా నటించింది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన శృతిహాసన్ (Shruti Haasan) కథానాయికగా కనిపించనుంది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.