
జోష్‌ఫుల్ సాంగ్స్ కి కేరాఫ్ సింగర్ కేకే (కృష్ణ కుమార్ కున్నత్). తెలుగులో అద్భుతమైన యూత్‌ఫుల్ సాంగ్స్ పాడి ఉర్రూతలూగించారు. తెలుగు శ్రోతలకు దగ్గరయ్యారు. పదికిపైగా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో పాటలు పాడిన ఆకట్టుకున్నారు. అద్యంతం అలరించారు. ఆయన హఠాన్మరణం తెలుగు ఆడియెన్స్ తోపాటు యావత్ ఇండియన్ శ్రోతలకు తీరని లోటు. ఆయన మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని నజ్రుల్ మంచాలోని కాలేజ్ ఫెస్ట్ లో పర్‌ఫెర్మింగ్ చేస్తున్న క్రమంలో ఆయన హార్ట్ ఎటాక్‌కి గురై కన్నుమూయడం అత్యంత విషాదకరం.
Singer KK : ప్రముఖ గాయకుడు కేకే మృతి..
కేకే తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠి, బెంగాలీ, అస్సామీ, గుజరాత్ వంటి పలు ఇండియన్ భాషల్లో అనేక పాటలు ఆలపించారు. దేశ వ్యాప్తంగా పాపులర్ సింగర్‌గా ఎదిగారు. తెలుగులో కేకే అద్భుతమైన పాటలు పాడారు. ఈ సందర్భంగా కేకే పాడిన తెలుగు పాటలపై ఓ లుక్కేద్దాం.
సింగర్ కేకే తెలుగులో మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `స్టూడెంట్ నెంబర్ 1`సినిమాలో పాట పాడారు. ఇందులో `ఒకరికి ఒకరై ఉంటుంటే` అనే పాటని కేకే ఆలపించిన సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆయన పాడిన తొలి తెలుగు పాట ఇదే. ఆ తర్వాత `ఆర్య` చిత్రంలో `ఫీల్ మై లవ్` పాటని పాడారు. ఇది ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. చిరంజీవి `ఇంద్ర` దాయి దాయి దామ్మా` పాట ఓ ఊపు ఊపేసింది. ఇందులో చిరంజీవి వీణ స్టెప్పులు అప్పుడు ఇప్పుడు ఫేమస్. పవన్ కళ్యాణ్ నటించిన `గుడుంబా శంకర్`లో `లే లే లే లే ఇవాళే లేలే` అంటూ జోష్ నింపే పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. దీంతోపాటు `శంకర్ దాదా ఎంబీబీఎస్`లో `చైల చైల చైలా చైలా` పాటని అలపించి మరింత ఆకట్టుకున్నారు.
Singer KK : బాలీవుడ్ సింగర్ కేకే మృతి పట్ల ప్రధాని, కేంద్ర హోం మంత్రి సంతాపం
`నేనున్నాను` సినిమాలో `నీ కోసం నీ కోసం` పాటలో సెంటిమెంట్‌ని పండించారు కేకే. `జయం` చిత్రంతో `ప్రేమ ప్రేమా ప్రేమా`పాటతో కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. `సంతోషం` సినిమాలో `దేవుడే దిగి వచ్చినా` పాటతో మరోసారి యువతలో ఉత్తేజాన్ని నింపారు. తెలుగు ఆడియెన్స్ కి సరికొత్త ఎనర్జీనిచ్చారు. `జై చిరంజీవ` చిత్రంలో `హే జాణ` పాట ఆహ్లాదాన్ని పంచారు. `ఘర్షణ` చిత్రంలో `చెలియా చెలియా` మెలోడీ పాటతో మెస్మరైజ్ చేశారు. `నా ఆటో గ్రాఫ్`లో `గుర్తుకొస్తున్నాయి` పాటతో చిన్ననాటి గుర్తులను నెమరేసుకునేలా చేశారు. `బంగారం` సినిమాలో `చెడుగుడంటే భయం` పాటతో మరోసారి మెప్పించారు. చివరగా ఆయన `సైనికుడు` చిత్రంలో `గో గో అదిగో` అంటూ మరోసారి ఉర్రూతలూగించారు.
ఇలా చాలా వరకు సింగర్ కేకే ఉత్సహభరితమైన పాటలతో తెలుగు శ్రోతలను అలరించారు. ఇండియన్ పాప్, రాక్ మ్యూజిక్ లతో మోడ్రన్ మ్యూజిక్‌కి కొత్త హంగులద్దారు. 1996 నుంచి చనిపోయేంత వరకు అన్ని భాషల్లో వేల పాటలు పాడారు. పాడుతూనే అస్తమించారు. పాటలోనే నిద్రపోయారు. శ్రోతల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ లోకం, యావత్ సంగీత లోకం దిగ్భ్రాంతికి గురవుతుంది. సంగీత ప్రపంచానికిదొక దుర్ధినంగా వర్ణిస్తున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఢిల్లీకి చెందిన కేకే 1968 ఆగస్ట్ 23న జన్మించారు. మే 31 2022 కన్నుమూశారు.