కోలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కమెడియన్‌ ఆర్‌ఎస్‌ శివాజీ కన్నుమూత..

Published : Sep 02, 2023, 05:15 PM IST
కోలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కమెడియన్‌ ఆర్‌ఎస్‌ శివాజీ కన్నుమూత..

సారాంశం

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్‌ ఆర్‌ ఎస్‌ శివాజీ కన్నుమూశారు. తెలుగులో ఆయన `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంలో నటించడం విశేషం.

కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్‌ ఆర్‌ఎస్‌ శివాజీ(66) కన్నుమూశారు. కమల్‌ హాసన్‌తో అనేక చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతుతుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ఆర్‌ఎస్‌ శివాజీ.. ప్రముఖ నిర్మాత ఎంఆర్‌ సంతానం కుమారుడు. ఆయన సోదరుడు సంతాన భారతి కోలీవుడ్‌లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విశేష గుర్తింపు పొందారు ఆర్‌ ఎస్‌ శివాజీ. తమిళంలోనే కాదు తెలుగులోనూ అనేక చిత్రాలు చేశారు. వందకుపైగా చిత్రాల్లో నటించారు. 1981లో వచ్చిన `పన్నీర్‌ పుష్పాలు` సినిమాతో కోలీవుడ్‌లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. 

శివాజీ.. కమల్‌ హాసన్‌తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన సినిమాల్లోనూ నటించారు. అంతేకాదు కమల్‌ తో అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కమల్‌తో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. `గుణ`, `చాచి420`, `అన్బేశివం`, `మైఖేల్‌ మదన కామరాజు`, `అపూర్వ సగోదరగళ్‌`, `సత్య`, ఇటీవల వచ్చిన `విక్రమ్‌` చిత్రాల్లోనూ నటించారు. ఈ సినిమాలు తెలుగులోనూ అనువాదం కావడంతో ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు కూడా చేశారు శివాజీ. చిరంజీవి, శ్రీదేవి కలసి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో `మాలోకం` అనే కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. ఆద్యంతం నవ్వులు పూయించారు. తేజ డైరెక్షన్‌లో `100 అబద్దాలు` సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల కాలంలో ఆయన `కోలమావు కోకిల`, `సూరరై పొట్రు`, `ధారల ప్రభు`, `గార్గి` చిత్రాలు చేశారు. చివరగా యోగిబాబు నటించిన `లక్కీ మ్యాన్‌`లో నటించారు. అది శుక్రవారమే విడుదలైంది. శివాజీ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేయడంతోపాటు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?