విషాదంః ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు కన్నుమూత ..

By Aithagoni Raju  |  First Published Nov 27, 2021, 7:58 AM IST

 ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌ నాగేశ్వరరావు కన్నుమూశారు. శుక్రవారం ఆయన ఊరు నుంచి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఫిట్స్ కారణంగా ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థారించినట్టు నాగేశ్వరరావు కుమారుడు వెల్లడించారు.


తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌ నాగేశ్వరరావు(K S Nageswara Rao) కన్నుమూశారు. శుక్రవారం ఆయన ఊరు నుంచి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఫిట్స్ కారణంగా ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థారించినట్టుగా ఆయన కుమారుడు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు వీరశంకర్‌ తెలిపారు. వీరశంకర్‌, కె.ఎస్‌.నాగేశ్వరరావు చాలా కాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారు. హైదరాబాద్‌కి వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలో ఆయన ఫిట్స్ కి గురయ్యారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రెండు మూడు ఆసుపత్రులు మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఏలూరు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. 

ప్రస్తుతం దర్శకుడు K S Nageswara Rao మృతదేహం వాళ్ల అత్తగారు ఊరైనా నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో ఉంచారు. వారి అత్తగారి ఇంటి వద్దే కె.ఎస్‌.నాగేశ్వరరావు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు తెలిపారు. దర్శకుడు కె.ఎస్‌. నాగేశ్వరరావుకి ఓ కుమారుడు, కూతురు, భార్య ఉన్నారు. ఆయన మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పలువురు దర్శకులు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 

Latest Videos

undefined

కె.ఎస్‌.నాగేశ్వరరావు.. 1986 నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్నారు. దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. `తళంబ్రాలు` సినిమా నుంచి ఆయన వద్ద పనిచేస్తున్నారు. `రిక్షా రుద్రయ్య` సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇందులో కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ `పోలీస్‌` సినిమాని రూపొందించారు. వరుసగా `సాంబయ్య`, `శ్రీశైలం`, `దేశద్రోహి` వంటి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. 

వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా ఓసినిమాని రూపొందిస్తున్నారు. అయితే ఇది ఇంకా పూర్తి కాలేదు. అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ సినిమా అప్‌డేట్‌ ఏంటనేది తెలియాల్సి ఉంది. గత కొంత కాలంగా కె.ఎస్‌.నాగేశ్వరరావు అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయనకు శుక్రవారం ఫిట్స్ రావడం, ఆ వెంటనే హఠాన్మరణం చెందడం బాధాకరం. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర ప్రముఖులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వీర శంకర్‌ సైతం విచారం వ్యక్తం చేశారు. తన ఫ్రెండ్‌ మరణం తీరని లోటని వెల్లడించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని వీర శంకర్‌ చెప్పారు.

click me!