Breaking: కంగనాకి నాంపల్లి కోర్ట్ షాక్‌.. కేసు నమోదుకి ఆదేశాలు..

By Aithagoni RajuFirst Published Nov 26, 2021, 8:39 PM IST
Highlights

తాజాగా నాంపల్లి కోర్ట్ కంగనాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. స్వాతంత్ర్యంపై కంగనా ఆ మధ్య పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె ఇటీవల వరుసగా వివాదాస్పద కామెంట్లు చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. స్వాతంత్ర్యంపై ఆమె అత్యంత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీజీని కించపరుస్తూ పోస్ట్ లు పెట్టి దుమారం సృష్టించింది. మరోవైపు ఇటీవల వ్యవసాయ చట్టాల రద్దు విషయంలోనూ సిక్కులను ఖలిస్థాన్‌ ఉగ్రవాదులుగా పోల్చుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టి  వివాదాలకు తెరలేపుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమెపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. 

తాజాగా నాంపల్లి కోర్ట్ కంగనాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. స్వాతంత్ర్యంపై కంగనా ఆ మధ్య పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారతదేశానికి 1947లో కాదు, 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని, మోడీ గెలిచాకే అసలైన ఫ్రీడమ్‌ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసిందీ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌. దీంతో ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగాయి. అదే సమయంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. సామాజిక కార్యకర్తలు, సంస్థలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా హైదరాబాద్‌కి చెందిన ఓ న్యాయవాది నాంపల్లి కోర్ట్ లో పిటిషన్‌ వేశారు. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆయన కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. 

తాజాగా నాంపల్లి కోర్ట్ శుక్రవారం ఈ పిటిషన్‌ని స్వీకరించి విచారణ చేపట్టింది. దేశ ప్రజల మనో భావాలు దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలున్నాయని న్యాయవాది పేర్కొన్న అంశాలను పరిశీలించిన కోర్ట్ కంగనాపై కేసు నమోదుకి ఆదేశాలు జారీ చేసింది. కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలని సైఫాబాద్‌ పోలీసులను ఆదేశించింది. అంతేకాదు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులకు తెలిపింది కోర్ట్. దీంతో కంగనా చుట్టూ వివాదాలు మరింతగా ముదురుతున్నాయని చెప్పొచ్చు. 

కంగనా రనౌత్‌ గత ఏడాది నుంచి వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మరణం సమయంలోనూ ఆమె అనేక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ పై కూడా ఆమె విమర్శలు చేశారు. బాలీవుడ్‌ డర్టీ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల మోడీ ప్రధాని అయిన తర్వాతనే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ వివాదస్పద పోస్ట్ లు పెట్టింది కంగనా. మరోవైపు గాంధీజీపై సైతం తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు ప్రధాని మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రపై విమర్శలు చేసింది కంగనా. రైతులు చేస్తున్న ఉద్యమంపై, దానికి నాయకత్వం వహిస్తున్న సిక్కులను ఆమె తీవ్రవాదులుగా పోల్చారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమెపై కేసు నమోదు కావడం గమనార్హం. 

కంగనా రనౌత్‌ ఇటీవల `తలైవి` చిత్రంలో నటించారు. తమిళనాడు మాజీ సీఎం, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్‌ ఇది. విడుదలై ఆకట్టుకుంది. కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరోవైపు బాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె `ధాఖడ్‌`, `తేజాస్‌`, `టికు వెడ్స్ షేరు` చిత్రాల్లో నటిస్తుంది. `టికు వెడ్స్ షేరు` చిత్రంతో నిర్మాతగా మారుతుంది.

 

click me!