
స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ గా చర్యలు తీసుకోమని తమ టీమ్ కు ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ తీవ్రంగా స్పందించింది. తమ అధినేతపై తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జనసేన లీగల్ సెల్ నిర్ణయించింది. కొన్ని ట్విట్టర్ ఖాతాలు, వెబ్ సైట్లపై ఈ సందర్బంగా లీగల్ యాక్షన్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పవన్ గురించి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా జనసేన కేడర్‌లో గందరగోళం సృష్టించాలని ఉద్దేశపూర్వకంగానే ఈ తరహా తప్పుడు పోస్టులు పెట్టారని జనసేన పార్టీ ఆరోపించింది. ఇది కొందరు వ్యక్తుల కుట్రేనని.. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని జనసేన పేర్కొంది. పవన్ కల్యాణ్‌పై తప్పుడు ప్రచారం చేసిన వారంతా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని , లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు, సంస్థలపై పరువు నష్టం, క్రిమినల్ కుట్ర వంటి కేసులు నమోదు చేస్తామని జనసేన పార్టీ తెలిపింది.
అలాగే నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఎంతో ఘనంగా జరిగిన వీరి పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగా మిగలడంతో ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రూమర్ క్రియేటర్స్ రెచ్చిపోయారు. మెగా ఫ్యామిలీలో మరో జంట విడాకులకు సిద్ధమైందంటూ ఇష్టమొచ్చినట్లుగా ప్రచారం మొదలెట్టారు. ఈ ప్రచారం టార్గెట్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గురించే అన్నది సుస్పష్టం.
అన్నా లెజ్‌నేవా- పవన్ జంట విడిపోతోందంటూ మీడియాలో రకరకాలుగా కథనాలు మొదలెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జనసేన పార్టీ .. రూమర్స్ కు చెక్ పెట్టేలా కొన్ని ఫోటోలు విడుదల చేసింది. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కల్యాణ్ , ఆయన సతీమణి అన్నా లేజ్‌నేవాలు హైదరాబాద్‌లోని తమ నివాసంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అయితే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో సదరు ఫోటోలు ఫేక్ అని, గ్రాఫిక్స్ అని వీడియోలు రిలీజ్ చేయడమే కాకుండా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీంతో ఈసారి పవన్ కాస్త సీరియస్‌గా స్పందించారు. తక్షణం ఈ వ్యక్తులు, నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన లీగల్ సెల్‌ను ఆదేశించారు. అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన లీగల్ సెల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ట్విట్టర్లో కొన్ని ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేస్తూ వెంటనే బేషరతుగా పవన్ కళ్యాణ్ దంపతులకు క్షమాపణలు చెప్పాలని తాము తప్పుడు ప్రచారం చేయబోయినట్టు ఒప్పుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ అలా క్షమాపణ చెప్పకపోతే వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఇలాంటి ఫాల్స్ న్యూస్ సర్కులేట్ చేస్తున్నావారందరి మీద చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు. సెక్షన్ section 153,499,500 and 120-B read with 34 ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జనసేన ట్యాగ్ చేసిన అకౌంట్లలో కొన్ని వ్యక్తిగత అకౌంట్లతో పాటు పార్టీల అకౌంట్లు కొన్ని వార్త ఛానల్స్ అకౌంట్లు కూడా ఉండడం గమనార్హం.