
తమిళనాడు తిరుచ్చి జిల్లా, లాల్ కుడి గ్రామానికి చెందిన విగ్నేష్ శివన్ తండ్రి పేరు శివ కొళుదు. వీరు తొమ్మిది మంది అన్నదమ్ములు. శివ కొళుదు పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసేవారట. ఆయన కొన్నాళ్ల క్రితం మరణించారు. అయితే శివ కొళుదు జీవించి ఉన్నప్పుడు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిని అమ్ముకున్నాడట. ఈ మేరకు విగ్నేష్ శివన్ బాబాయిలు అయిన మాణిక్యం, కుంచిత పాదం ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తి మాకు తెలియకుండా అమ్ముకున్న నేపథ్యంలో కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి, తిరిగి ఆస్తి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తిరుచ్చి డీజీపీ ఆఫీస్ లో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులో విగ్నేష్ శివన్, నయనతారలతో పాటు విగ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
దాదాపు ఏడేళ్లు డేటింగ్ చేసిన నయనతార, విగ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక వివాదం వారిని వెంటాడుతుంది. వివాహం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ఈ జంట ఓ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల మాడవీధుల్లో నయనతార చెప్పులతో సంచరించడంపై హిందూ వర్గాలు మండిపడ్డాయి. టీటీడీ చర్యలకు సిద్ధం కావడంతో క్షమాపణలు చెప్పి బయటపడ్డారు.
పెళ్ళైన నెలల వ్యవధిలో కవలలకు తల్లిదండ్రులం అయ్యామంటూ ప్రకటించడం వివాదాస్పదమైంది. సరోగసీ నిబంధనలు ఉల్లఘించారని తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే తమకు ఐదేళ్ల క్రితమే పెళ్లయింది. సరోగసీ చట్టంలోని అన్ని నియమాలు పాటించామంటూ ఆధారాలు సమర్పించారు. దాంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ కి జంటగా జవాన్ చిత్రంలో నటిస్తున్నారు.