
మెగా స్టార్ ఫ్యామిలీ హీరోగా ఆరంగేట్రం చేసి... తన టాలెంట్ తో అనతి కాలంలోనే పవర్ స్టార్ అనిపించుకన్నారు పవన్ కళ్యాణ్. సినిమాల ద్వారా తనకు వచ్చిన ఇమేజ్ ను ఆసరాగా చేసుకుని ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ కూడా స్థాపించి.. విశేష ప్రజాదరణతో.. ప్రజా సమస్యలపై నేతలను నిలదీస్తూ సాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇంతటి ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తి ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. ఆ విషయాలను పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించాడు.
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పవన్ ప్రసంగించాడు. ఇండియన్ కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా దాదాపు గంటసేపు మాట్లాడిన పవన్.. తన బాల్యం, విద్య, సామాజిక అవగాహన, సినిమాలు, రాజకీయాల్లో తన అనుభవాలను పంచుకున్నాడు. చదువులో తానెప్పుడూ వెనకేనని, చదువు అస్సలు అబ్బేదే కాదని వెల్లడించాడు. పుస్తకాల్లో ఉన్నదానికి సమాజంలో జరుగుతున్నదానికి చాలా తేడాలను చిన్నప్పుడే గమనించానని, అది చూసి విపరీతమైన విసుగు పుట్టేదని చెప్పాడు. ఒకానొక దశలో తన అన్న చిరంజీవి లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకుని చనిపోదామనుకున్నానని పవన్ వెల్లడించాడు.
అదృష్టం కొద్దీ కుటుంబ సభ్యుల కౌన్సెలింగ్‌తో ‘ఆత్మహత్య’ ఆలోచనలను విరమించుకున్నానని షాకింగ్ విషయాన్ని తెలిపాడు. ఆ తర్వాత నెమ్మది..నెమ్మదిగా సమాజంపై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. కాగా, జనసేన పార్టీ ఎప్పుడూ జాతీయ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించాడు.