
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.
దీనితో భీమ్లా నాయక్ మ్యానియా పీక్స్ కి చేరుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పొలిటికల్ గా ఎలా ఉన్నా.. కేటీఆర్, పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి అభిమానులని అలరించారు.
ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. నేను కేటీఆర్ గారిని రామ్ భాయ్ అని పిలుస్తాను. భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ తరుపున ఆయనకు నా కృతజ్ఞతలు. ఎలాంటి సమస్య వచ్చినా ముందుకు వచ్చి ఆత్మీయంగా పలకరించే వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.
ఇది చిత్ర పరిశ్రమ. కళాకారులు ఉండే ప్రదేశం. ఇక్కడ రాజకీయాలు ఇమడవు. చాలా ఏళ్ల క్రితం పెద్దల సహకారం వల్ల.. మర్రి చెన్నారెడ్డి గారి సహకారం వల్ల చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది. ఆ బంధాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరింత బలంగా ముందుకు తీసుకువెళుతున్నారు. చిత్ర పరిశ్రమకు సహకారం అందిస్తున్నారు.
నేను జనజీవితంలోకి వెళుతున్నాను అంటే అందుకు కారణం సినిమానే. సినిమానే నాకు అన్నం పెట్టింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. నా పొలిటికల్ షెడ్యూల్స్ కి అనుగుణంగా భీమ్లా నాయక్ షూటింగ్ ప్లాన్ చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుండి నడిపించారు. అమెరికాలో చదువుకుని, సినిమా ప్రపంచంలో కలలు కంటూ ఇక్కడకు వచ్చిన యువకుడు సాగర్ చంద్ర. ప్రతిభావంతుడైన దర్శకుడు అని పవన్ ప్రశంసించారు. రానా అద్భుతంగా నటించారు. పోలీస్ అధికారికి, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్రం అని పవన్ తెలిపారు.పవన్ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసింది.
పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా తొలిసారి నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మురళి శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.