
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలుత పోటీ చేస్తామని చెప్పి ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయనను తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరితే సరిపోతుంది కదా? అని ఎద్దేవా చేశారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌పై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆయన్ను తప్పు పడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా పేరున్న నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సైతం మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఎన్నికల సమయం కాబట్టి రాజకీయాలు మాట్లాడకూడదని తానేం మాట్లాడటం లేదని అన్నాడు. తనకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదని చెప్పారు. పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని... ఆయన నిజాయతీ, నిబద్ధత ఏమిటో తనకు తెలుసని అన్నారు. పవన్ మహోన్నతమైన వ్యక్తి అని గణేశ్ చెప్పారు.
రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చని, రాజకీయాలు ఎవరైనా మాట్లాడవచ్చని... కానీ, పవన్ గురించి కానీ, ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఎవరైనా మాట్లాడితే తాను సహించనని అన్నారు. తనకు పవన్ దైవంతో సమానమని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది సాంకేతిక నిపుణులను, ఎంతో మంది నిర్మాతలను పరిచయం చేసిన ఘనత పవన్ దేనని అన్నారు.
ఇక ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే..."పవన్ ఓ పార్టీకి నాయకుడు... అలాంటప్పుడు తన పార్టీకి ఓట్లు అడగకుండా, మరో నాయకుడి వైపు వేలు చూపించి అతనికే ఓట్లు వేయాలని చెప్పడమేంటి? పవన్ కల్యాణ్ కు అసలేమైందో అర్థంకావడంలేదు. స్థిరత్వంలేని నిర్ణయాలతో ఊసరవెల్లిలా మారిపోయారు. 2014లో పవన్ బీజేపీని పొగిడారు. ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్లను ద్రోహులని లెఫ్ట్ పార్టీలతో కలిశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లతో కలిశారు. ఇలా పూటకో మాట మార్చుతుంటే ఇంకేమనాలి?
జాతిహితం కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలంటున్నాడు. సొంత పార్టీ జనసేనను వదిలేసి మరో పార్టీ కోసం పనిచేయడం ఏంటో అర్థంకావడంలేదు. మరొకరి భుజాలపైకి ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు?" అంటూ నిశిత వ్యాఖ్యలు చేశారు.