
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియంకి ఇది రీమేక్.
ఆల్రెడీ ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలైపోయాయి. పవన్ కళ్యాణ్, రానా సాలిడ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెల్లవారు జాము నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. కానీ ఏపీలో మాత్రం అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పైగా తగ్గించిన టికెట్ ధరల్ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం థియేటర్ల చుట్టూ చక్కర్లు కొడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బుధవారం రోజు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనితో కేటీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ జనసేన తరుపున పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బిజీ షెడ్యూల్ లో కూడా భీమ్లా నాయక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు.
సినిమా రంగాన్ని, కళని మంత్రి కేటీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు అని పవన్ ప్రశంసించారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా, భావవైవిధ్యం ఉన్నా వాటిని కళకు, సినిమా రంగానికి అంటనీయక పోవడం గొప్ప విషయం. అది తెలంగాణ రాజకీయ నేతల శైలిలోనే ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు పవన్.
ఒక వైపు ఏపీలో భీమ్లా నాయక్ చిత్రానికి ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానాకి జోడిగా సంయుక్త మీనన్ నటించారు.