ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన ఓ దొంగ కథ. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆగిపోయిందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో టీమే ఎలర్ట్ అయ్యింది. ఈ సినిమా అప్డేట్స్ పై ఇటీవల స్పష్టత వచ్చింది. ఈ నినిమా రద్దయిందని పుకార్లు చక్కర్లు కొట్టగా.. ఎట్టకేలకు మూవీ టీమ్ స్పందించింది. ఈ చిత్రం వీఎఫ్‍ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. నాలుగేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని చెప్తూ... త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. ఈ నేపధ్యంలో ఈ ప్రోమో ఎప్పుడు రానుందో విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రోమోని శివరాత్రి రోజు (మార్చి 8,శుక్రవారం)నాడు వదలాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగతున్నాయని వినికిడి.ఈ ప్రోమో వస్తే ఖచ్చితంగా సినిమా ఉందని, ఎటువంటి మార్పులు ఉండవని చెప్పినట్లు అవుతుందని నిర్మాత,టీమ్ భావించారట.
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు. మొఘల్ కాలంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు దొంగ పాత్రనే ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొఘల్ రాకుమారి పాత్రలో కనిపించనుందని టాక్. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా చేస్తున్న సమయంలో వచ్చిన కోవిడ్ గ్యాప్‌లో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం సినిమా చేశారు. ఆ సినిమా రిలీజైంది. మధ్యలో ఓ వెబ్ సిరీస్ సైతం నిర్మించారు. కానీ ఇంతకాలం అయినా ఈ సినిమా మాత్రం పూర్తి కాలేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై రకరకాల విషయాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన ఓ దొంగ కథ. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొఘలులు, కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు, పరిశోధనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం హరి హర వీరమల్లు సినిమాకి ప్రధాన ఆకర్షణ.