
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్ మధ్య మంచి అనుబంధం ఉంది. సొంత అన్నాదమ్ముల మధ్య ఉన్న అనుబంధం వారిది. పవన్ నా తమ్ముడు, ప్రేమగల్ల తమ్ముడు అంటూ పదే పదే చెప్పేవారు గద్దర్. తనకు అవసరమైతే ఆయన జేబులో చెయ్యి పెట్టి ఎన్ని డబ్బులుంటే అన్ని తీసేసుకునేంత చనువు తమ మధ్య ఉందని అన్నారు. అలాంటి గద్దర్ ఇప్పుడు లేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రజా పాటల్లో ఓ శకం ముగిసిందని చెప్పొచ్చు. శ్రమజీవులపాట మూగబోయిందని చెప్పొచ్చు. గద్దర్ మరణంతో కోట్లాది ప్రజలు కన్నీరు పెడుతున్నారు. తమ గొంతు మూగబోయిందంటూ కార్మికులు బోరున విలపిస్తున్నారు.
ఈ క్రమంలో గద్దర్‌పై ఉన్న తన ప్రేమని, అభిమానాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు పవన్. ప్రత్యేకంగా ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మొదటగా ఆయన ఆ మధ్య తన సినీ ప్రయాణంలో ప్రముఖులతో అనుబంధాన్ని చాటుకునేలా ఓ ప్రత్యేకమైన ఫోటోల వీడియోని పంచుకున్నారు. ఇప్పుడు తన రెండో పోస్ట్ గా గద్దర్‌పై పోస్ట్ చేశారు. `నా అన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్` అంటూ ఆయన ఈ పోస్ట్ చేశారు. ఇందులో గద్దర్ గురించి గొప్పగా చెప్పారు పవన్. తన వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో సాగుతుండటం విశేషం.
`భీటలు వారిన ఎండలో సమ్మెట కొట్టే కూలికి గొడుగు గద్దర్, తాండాల బండల్లో చలిపులిని బెదిరించే నెగటు గద్దర్, పీడిత జనాల పాట గద్దర్, అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్, అడవిలో ఆకు చెప్పి కథ గద్దర్. కోయిల పాడిన కావ్యం గద్దర్, గుండెకు గొంత్తొస్తే, బాధకి భాషొస్తే అది గద్దర్, అన్నింటిని మించి నా అన్న గద్దర్. అన్నా.. నువ్వు గాయపడ్డ పాటవి, కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవి, అన్యాయంపై తిరగబడ్డ పాటవి, ఇది వరకు నువ్వు ధ్వనించే పాటవి, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి, తీరం చేరిన ప్రజా యుద్ధనౌకకి జోహార్.. జోహార్.. జోహార్` అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. గద్దర్‌తో దిగిన ఫోటోలను కూడా ఇందులో పంచుకున్నారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీంతోపాటు తన గురించి గద్దర్ చెప్పిన మాటలను కూడా ఆయన మరో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. `నా తమ్ముడా పవన్` అంటూ ఈ వీడియోని షేర్ చేసుకున్నారు. పవన్ రాజకీయ ప్రయాణం గురించి ఇన్‌స్పైర్ చేసే వ్యాఖ్యలు చేశారు. ఉత్సాహాన్ని నింపే మాటలు చెప్పారు గద్దర్. ఆయనకు రాజకీయ సూచన చేసేలా ఈ వ్యాఖ్యలు ఉండటం విశేషం. ఆ వీడియో సైతం ఆకట్టుకుంటుంది. వైరల్‌గా మారింది.