
ఫ్యాన్స్ ఆశపడుతున్న క్రేజీ కాంబినేషన్ పవన్-హరీష్ శంకర్. చాలా కాలంగా గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ మరలా రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. 2018లో పవన్ ఇక సినిమాలకు సెలవని ప్రకటించడంతో ఇది జరగని పని అనుకున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మనసు మార్చుకున్న పవన్ కమ్ బ్యాక్ ప్రకటించారు. పనిలో పనిగా ఫ్యాన్స్ ఆశపడిన హరీష్ శంకర్ తో మూవీ ప్రకటించారు. దర్శకుడు హరీష్ తో పాటు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంతోషం వ్యక్తం చేశారు. అయితే వాళ్ళ ఆనందం మెల్లగా ఆవిరవుతూ వచ్చింది. ఏడాది క్రితమే సెట్స్ పైకి వెళ్లాల్సిన హరి హర వీరమల్లు అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది.
ముందుగా ఒప్పుకున్న చిత్రాలు పక్కన పెట్టి పవన్ భీమ్లా నాయక్ పూర్తి చేశాడు. ఈ కారణంగా షూటింగ్ మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు, ఇంకా స్టార్ట్ కానీ భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్స్ డిలే అయ్యాయి. కమ్ బ్యాక్ తర్వాత రెండు రీమేక్స్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మాత్రమే పూర్తి చేశాడు. రాజకీయాల్లో బిజీ అయిన పవన్ హరి హర వీరమల్లుపై ఆసక్తి చూపడం లేదు. మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి త్వరగా పూర్తి చేసి నిర్మాతను గట్టెక్కిద్దాం అనే ఆలోచన చేయడం లేదు. మరో నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
ఇది నెలల పాటు సాగనుంది. అంటే పవన్ బస్సు యాత్ర ముగిసేనాటికి ఏపీలో ఎన్నిక హీటు మరింత పెరుగుతుంది. ఎన్నికలకు ఏడాది సమయం కూడా ఉండదు. పవన్ కి ఉన్న ఈ అతికొద్ది సమయంలో హరి హర వీరమల్లు పూర్తి చేయడమే కష్టం. ఇక భవదీయుడు భగత్ సింగ్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. నిజం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే, హరీష్ లేని ధైర్యం ప్రదర్శిస్తున్నాడు. సినిమా డిలే కాబోతుందని తెలిసి అసలేం నష్టం జరగనట్లు నటిస్తున్నారు.
పవన్ బర్త్ డే నాడు హరీష్ చేసిన ట్వీట్ ఇందుకు నిదర్శనం. రావడం లేటవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా... అని హరీష్ కామెంట్ చేశారు. లేటు అంటే ఇక్కడ ఏడాదా? లేక రెండేళ్ళా?. ఒక వేళ అంత లేటైతే హరీష్ మరో హీరోతో సినిమా చేయకుండా ఎదురుచూస్తారా?. హరీష్ చివరి చిత్రం గద్దలకొండ గణేష్ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. అనుకున్న సమయానికి భవదీయుడు సెట్స్ పైకి వెళ్లలేదన్న బాధ ఆయనకు గట్టిగా ఉంది. పైకి అది కనిపించకుండా దాచేస్తున్నాడు. 2024 ఎన్నికల తర్వాతే హరీష్ తో మూవీ. అప్పటికి కూడా పవన్ కి చేయాలనే మూడ్ ఉంటే. ఇంత సంక్లిష్ట పరిస్థితిని ప్రస్తుతం హరీష్ ఎదుర్కొంటున్నారు.