
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' నరసింహారెడ్డి సినిమా టీజర్ ని చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. అయితే ముందుగా ఈ టీజర్ చూసిన వ్యక్తి ఎవరో తెలుసా..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. శిల్పకళావేదికలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్.. టీజర్ చూసి పవన్ ఏం అన్నారో ప్రేక్షకులకు చెప్పి వారిని ఉత్తేజపరిచారు.
''ఉదయం 10.45 కి టీజర్ నా దగ్గరకి వచ్చింది. దాన్ని ముందుగా కళ్యాణ్ బాబాయ్ కి పంపించాను. ఆయనకు 11 గంటలకు నేను ఫార్వార్డ్ చేయగా.. 11.10 నిమిషాలకు ఆయన నుండి మెసేజ్ వచ్చింది. అదిరిపోయింది థియేటర్లో చూడడానికి రెడీ అవుతున్నాను అన్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు. అలానే ఈ వేడుకలో అభిమానులను తన మాటలతో సంతోషపరిచాడు.
మీ అందరినీ ఉత్సాహపరచడానికి డైరెక్టర్ ని అడిగి మరీ పుట్టినరోజు కానుకగా టీజర్ ని తీసుకొచ్చామని అభిమానులను ఉద్దేశిస్తూ అన్నారు. తేదీ ఖరారు చేయనప్పటికీ వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.