
భీమ్లా నాయక్ విడుదలపై చాలా రోజులుగా సందిగ్ధత కొనసాగుతుంది. మేకర్స్ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అంటూ రెండు తేదీలు ప్రకటించారు. ఫ్యాన్స్ మాత్రం ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టికెట్స్ ధరలు, థియేటర్స్ సీటింగ్ కెపాసిటీ వంటి కీలక అంశాలు ఓ కొలిక్కి రాకపోవడంతో భీమ్లా నాయక్ నిర్మాతలు ప్రకటనకు ఎదురుచూశారు. టికెట్స్ ధరల పెంపును ఖరారు చేస్తూ కొత్త జీవో త్వరలో రానుంది. ఇక ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో పాటు వంద శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిచ్చింది.
దీంతో నిన్న భీమ్లా నాయక్ విడుదల పై అధికారిక ప్రకటన చేశారు. అభిమానులు కోరుకుంటున్నట్లు ఫిబ్రవరి 25న మూవీ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ విడుదల తేదీని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ ట్రైలర్ నుండి బాక్సాఫీస్ కలెక్షన్స్ వరకు రికార్డుల మోత మోగిస్తామంటున్నారు.
కాగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక (Bheemla Nayak Prerelease Event) కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. దాదాపు ఖాయమే అంటున్నారు. పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు ఎత్తివేయని కారణంగా ఏ మేరకు అభిమానులను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతిస్తారో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఓ రేంజ్ లో ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
సంక్రాంతికి విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ వాయిదా పడిన విషయం తెలిసిందే. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ అధికారిక రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారి రోల్ చేస్తున్నారు. అపవాన్ ప్రత్యర్థి ఆర్మీ అధికారి పాత్రను రానా చేస్తున్నారు. వీరిద్దరి మధ్య నడిచే ఆధిపత్య పోరే భీమ్లా నాయక్ చిత్రం. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నిత్యా మీనన్ పవన్ కి జంటగా నటిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు.