
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటన సందర్భంగా అమెరికన్ రాజకీయ వ్యూహకర్త స్టీవ్ జార్డింగ్‌తో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం లోని కెనెడీ స్కూల్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జార్డింగ్ కు పబ్లిక్ పాలసీ , రాజకీయ వ్యూహాల రూపకల్పనలో విశేష అనుభవం వుంది. అమెరికాలోని రాజకీయ పార్టీలకు సలహాదారుగా కూడా పనిచేస్తుంటారు జార్జింగ్. అంతేకాక అంతర్జాతీయంగా వివిధ రాజకీయ నేతలకు జార్డింగ్ రాజకీయ సూచనలు, సలహాలను అందిస్తున్నారు. ఇంతటి విశేష నైపుణ్యమున్న జార్డింగ్‌తో సుమారు రెండు గంటల పాటు ఏకాంతంగా పవన్ కళ్యాణ్ తో చర్చించారు.
2019 శాసన సభ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో జార్డింగ్, పవన్ సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఎటువంటి ఎత్తుగడలు అవలంభించాలి, అభ్యర్థుల ఎంపిక ఎలా జరగాలి తదితర వివరాలను విశ్లేషణాత్మకంగా పవన్ కళ్యాణ్‌కు జార్డింగ్ తెలియచేశారు. ఈ సందర్బగా జార్డింగ్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. వీలయితే 2019 ఎన్నికల ముందు మరోసారి కలుద్దామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
బోస్టన్ లోని చార్లెస్ హోటల్ లో పవన్ కళ్యాణ్ ని జార్డింగ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన సిద్ధాంతాలు, రాజకీయాలు తదితర అంశాలపై అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్త స్టీవ్ జార్డింగ్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విజయవంతమయిన రాజకీయ వ్యూహకర్తగా ఖ్యాతి గడించిన జార్డింగ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ ఆధ్వర్యంలోని సమాజ్ వాదీ పార్టీ ఎక్కువగా సలహాలను స్వీకరిస్తుంది. ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం జార్డింగ్ రూపొందిచిన వ్యూహాలనే అఖిలేష్ యాదవ్ అమలుచేస్తున్నారు.
మరోవైపు న్యూక్లియర్ నిపుణుడు ప్రొఫెసర్ మాథ్యూబన్, ఎనర్జీ పాలసీ రూపకర్త హెన్రీ లీతోనూ పవన్ కళ్యాణ్ సంభాషించారు. సీబ్రూక్ న్యూక్లియర్ ప్లాంట్ ను సందర్శించనున్నారు.11 వ తేదిన హార్వర్డ్ యూనివర్సిటీలో "బికమింగ్ జనసేనాని " అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.