"పద్మావతి" దర్శకుడు భన్సాలీకి షాకిచ్చిన పార్లమెంటరీ ప్యానెల్

First Published Dec 1, 2017, 5:13 PM IST
Highlights
  • ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి చిత్రం
  • పద్మావతి చిత్రం విడుదలపై కొంతకాలంగా నీలినీడలు
  • డిసెంబర్ 1న రిలీజ్ కావాల్సి వున్నా కాని పద్మావతి
  • రాజ్ పుత్ కుల సంఘాల నుంచి పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు

వివాదాస్పద ‘పద్మావతి’ చిత్రంపై చర్చించేందుకు పార్లమెంట్ లో జరిగిన... సమావేశానికి చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ గురువారం పార్లమెంట్‌ ప్యానెల్‌ విచారణకు హాజరయ్యారు. సమావేశంలో సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి కూడా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ప్యానెల్‌ ఛైర్మన్‌ అనురాగ్‌ ఠాకూర్‌ దర్శకుడు భన్సాలీపై మండిపడ్డారు. సినిమా సెన్సార్‌కు రాకముందే మీడియా వారికి ఎందుకు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భన్సాలీ సెన్సార్‌ బోర్డును అవమానించారని జోషి ఆరోపించారు. దీనిపై భన్సాలీ స్పందిస్తూ.. తనకు వేరే మార్గం దొరకలేదని సినిమాలో ఎలాంటి తప్పుడు సన్నివేశాలు చూపించలేదని నిరూపించుకోవడానికే స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశానని చెప్పారు.

 

సినిమాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే తాను చాలా నష్టపోయానని భన్సాలీ ప్యానెల్‌కు వివరించారు. మరోవైపు భన్సాలీ ఇలాంటి ఎమోషనల్‌ ఇష్యూతో సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారని ప్యానెల్‌ ఆరోపించింది.

 

సినిమా ఫిక్షనల్‌ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించినప్పుడు అందులో అసలు పేర్లు వాడాల్సిన అవసరమేముందని సెన్సార్‌ బోర్డు భన్సాలీని ప్రశ్నించింది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ‘పద్మావతి’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది.

 

పద్మావతి సినిమాపై భాజపా అగ్ర నేత ఎల్‌.కె అద్వానీ మాత్రం భన్సాలీకి మద్దతు తెలిపారు. సినిమా విషయంలో ఇప్పటికే చాలా మంది కలగజేసుకున్నారని ఇక ప్యానెల్‌ కలగజేసుకోవాల్సిన అవసరంలేదని ఠాకూర్‌కు అద్వానీ సూచించారు. అయితే ఠాకూర్ మాత్రం ఉద్రిక్తతలు రెచ్చగొట్టేది సినిమా ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

click me!