బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ చేతుల మీదుగా బాలయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
మొదటి నుంచి బాలయ్యకు ఓ అలవాటు ఉంది. మనస్సుకు ఏది తోస్తే అది మొహం మీదే చెప్పేస్తారు. ఎదుటివారు మెచ్చుకోలు కోసమో లేక జాగ్రత్తగా మాట్లాడాలనో ప్రయత్నించరు. ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్ నెస్ చాలా మందికి నచ్చుతుంది. అదే సమయంలో కొన్ని సార్లు వివాదాలకు దారి తీస్తుంది. అయినా బాలయ్య డోంట్ కేర్ అన్నట్లు ఉంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇఫా అవార్డ్స్ పంక్షన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మాటలు జూ.ఎన్టీఆర్ ని ఉద్దేశించే అని, ఇండైరక్ట్ కౌంటర్ అని ప్రచారం జరుగుతున్న వేళ, అసలు బాలయ్య ఏమన్నారో చూద్దాం.
ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) 2024 అవార్డుల ప్రదానోత్సవం అబుదాబిలో అట్టహాసంగా జరిగింది. నందమూరి బాలకృష్ణకు ఐఫా-2024 వేడుకల్లో అరుదైన పురస్కారం దక్కింది. ఈ కార్యక్రమంలో ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు ఇచ్చే ముందు బాలకృష్ణ పాదాలకు కరణ్ నమస్కరించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ సైతం హాజరయ్యారు.
ఇక ఇదే కార్యక్రమంలో చిరంజీవి కి ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డును అందుకున్నారు. చిరంజీవి ని సహచర హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్ అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తన తండ్రి బాలకృష్ణ తాజాగా ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేసారు.
"మీ వారసుడి సినిమా ఎప్పుడు మొదలు కానుంది ?" అంటూ యాంకర్ అడగ్గా, దానికి "మోక్షజ్ఞ మొదటి సినిమాని డిసెంబర్లో లాంచ్ చేస్తున్నాం" అంటూ బాలయ్య రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే అవార్డ్ వేడుక సందర్భంగా రెడ్ కార్పెట్ పై మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ గోల్డెన్ లెగసీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మరో పాతిక సంవత్సరాల పాటు హీరోగానే సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మోక్షజ్ఞ కి సైతం పోటీగా నేను సినిమాలు చేస్తాను అన్నట్లుగా బాలయ్య పేర్కొన్నారు.
అలాగే నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ.. మరి బాలకృష్ణ వారసులు ఎవరు అంటే ఏం చెప్తారు అంటూ మీడియా ప్రశ్నించిన సమయంలో ఆయన నుంచి వచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంకెవరు నా కొడుకు, నా మనవడు మాత్రమే నందమూరి వారసులు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ జూ. ఎన్టీఆర్ ను బాలయ్య నందమూరి ఫ్యామిలీ వారసుడు కాదు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు.
అలాగే నందమూరి ఫ్యామిలీ లో గ్యాప్ ను ఈ సమయంలో కొందరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటన వచ్చిన సమయంలో స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తమ్ముడికి స్వాగతం పలికిన విషయం తెల్సిందే. కాబట్టి నందమూరి ఫ్యామిలీ మధ్య మీడియాలో జరుగుతున్నట్లుగా ఎలాంటి విభేదాలు లేవు అనేది నందమూరి ఫ్యాన్స్ చెప్తున్నారు . ఏదైమైనా బాలయ్య వ్యాఖ్యలు చర్చకు తెర తీశాయి.