
విభిన్న పాత్రలు, చిత్రాలు ఎంచుకుంటూ కెరీర్ లో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు నటుడు సత్యదేవ్(Satyadev). ఆయన లేటెస్ట్ మూవీ గుర్తుందా శీతాకాలం. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా... సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆద్యంతం చాలా ఆహ్లాదంగా ట్రైలర్ సాగింది. సత్యదేవ్ లోని రొమాంటిక్ యాంగిల్ పరిచయం చేసింది. శీతాకాలంతో హీరో జీవితానికి ముడిపడి ఉన్న బంధం ఏమిటో తెలియజేసింది.
గుర్తుందా శీతాకాలం ట్రైలర్ (Gurtunda Seetakalam Trailer) హీరో సత్యదేవ్ వాయిస్ ఓవర్ తో సాగింది. తన జీవితంలో డిఫరెంట్ స్టేజెస్ లో పరిచయమైన అమ్మాయిల గురించి చెప్పారు. స్కూల్ డేస్ లో కోమలి, కాలేజ్ డేస్ లో అమ్ము, ఓ జర్నీలో దివ్య... చివరిగా నిధి... ఇలా తన జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. ప్రతి అమ్మాయి తనకు పరిచయమైంది శీతాకాలంలోనే. అందుకే సత్యదేవ్ కి శీతాకాలం అంటే సీజన్ ఆఫ్ మ్యాజిక్. నచ్చిన ప్రతి అమ్మాయిని తన లైఫ్ పార్నర్ గా ఊహించుకునే హీరో... నలుగురు అమ్మాయిలను ఇష్టపడతారు. వారిలో సత్యదేవ్ భార్య అయ్యేది ఎవరనేది ఈ సినిమా ఇతివృత్తం.
గుర్తుందా శీతాకాలం.. ట్రైలర్ సినిమాపై ఓ అంచనాకు వచ్చేలా చేసింది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సత్యదేవ్ కెరీర్ లో మొదటిసారి ఈ తరహా రోల్ చేస్తున్నారు. తమన్నా(Tamannah), మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు నాగ శేఖర్ తెరకెక్కిస్తుండగా, భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్నారు. కాలభైరవ గుర్తుందా శీతాకాలం చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా గుర్తుందా శీతాకాలం ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.
చాలా కాలంగా గుర్తుందా శీతాకాలం షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మూవీపై ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో చిత్ర స్టేటస్ ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ట్రైలర్ విడుదలతో కొంత మేర అనుమానాలకు తెరపడింది. గుర్తుందా శీతాకాలం మూవీ మేకర్స్ విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.