
జూ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఒక యాడ్ షూట్‌లో గాయపడినట్టు ఆయన టీమ్ వెల్లడించింది. హైదరాబాద్‌లో ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్.. చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని టీమ్ తెలిపింది. స్వల్పంగానే గాయాలు అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ వెల్లడించింది.
ఎన్టీఆర్ సినిమాలతోపాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం సీఎంఆర్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి యాడ్ షూట్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతుంది. ఈ యాడ్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ కాలు స్లిప్ అయ్యిందట. సెట్ అంతా చీకటిగా ఉండటంతో వేదిక అంచునుంచి ఎన్టీఆర్ జారి పడ్డారని తెలుస్తోంది. పక్కటెముకలు, చేతికి మధ్య స్వల్పంగా గాయమైందట. వెంటనే వైద్యులు పర్యవేక్షించి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఎన్టీఆర్ సురక్షితంగానే ఉన్నాడని, ఆల్‌రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చినట్టు సమాచారం. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని టీమ్ వెల్లడించింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. దీనికి `డ్రాగన్` అనే పేరు వినిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ ప్రధానంగా ఈ మూవీ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం కోసం తారక్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల జిమ్ వీడియో వైరల్ అయ్యింది. ఇందులో చాలా సన్నగా మారిపోయారు తారక్. పాత్ర కోసం ఆయన ఇలా వర్కౌట్స్ చేస్తున్నట్టు సమాచారం.