
Kamal Haasan-Rajinikanth: సౌత్ ఇండియన్ సినిమా అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూసిన కల నిజమవుతోంది. ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్‌లు దాదాపు 46 ఏళ్ల తర్వాత కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. ఈ వార్తపై ఇప్పటికే ఊహాగానాలు జోరుగా నడుస్తున్నా, తాజాగా కమల్ హాసన్ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ కొత్త జోష్ వచ్చింది.
ఇటీవల సైమా అవార్డ్స్ (SIIMA Awards)వేదికపై కమల్ హాసన్ ఈ విషయాన్ని ప్రకటించారు. “మా కాంబినేషన్‌ని ప్రేక్షకులు ఇష్టపడితే అదేనండి మా ఆనందం. మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించాం, కానీ కుదరలేదు. త్వరలోనే మీ ముందుకు కలిసి వస్తున్నాం. ఇది మీకు సర్‌ప్రైజ్ అవుతుంది” అని ఆయన స్పష్టంగా చెప్పారు. తమ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ గతంలో వచ్చిన వార్తలపై కమల్ స్పందిస్తూ “మా మధ్య ఎలాంటి తేడాలు లేవు. ఇవన్నీ మీరు సృష్టించుకున్నవే. మేము ఎప్పుడూ ఒకరిని మరొకరం పోటీగా చూడలేదు. ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని కూడా ప్రయత్నించాం” అని క్లారిటీ ఇచ్చారు.
కొన్నాళ్లుగా ఈ భారీ మల్టీస్టారర్‌కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అని టాక్ వినిపించింది. రజినీకాంత్ కూడా “కమల్‌తో సినిమా చేయబోతున్నాం” అని ఇటీవల ఓపెన్ అయ్యారు. దీంతో ఈ వార్త నిజమేనని భావించిన అభిమానులకు తాజాగా ఒక ట్విస్ట్ వచ్చింది. ఇద్దరూ దర్శకుడి పేరుపై మాత్రం మౌనం వహించారు. రజినీ కూడా “డైరెక్టర్ ఇంకా ఫిక్స్ కాలేదు” అని చెప్పడంతో సస్పెన్స్ పెరిగింది. దీంతో ఈ ఇద్దరు లెజెండ్స్‌ను హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
కమల్ హాసన్ – రజినీకాంత్ జంటగా 1970లలో 20కి పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరి మార్గాలు వేరుపడ్డాయి. దశాబ్దాల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ చూడబోతున్నామని తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు.