
మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ తో జతకట్టారు. గతంలో మమతా మోహన్ దాస్ కాన్సర్ బారినపడ్డారు. రెండు పర్యాయాలు ఆమెను క్యాన్సర్ అటాక్ చేసింది. అయినా పోరాడి నిలబడ్డారు. ప్రాణాంతక వ్యాధి నుండి విముక్తి పొందారు. ఆహార నియమాలు, వ్యాయామం తో క్యాన్సర్ ని జయించినట్లు మమతా మోహన్ దాస్ వెల్లడించారు. క్యాన్సర్ వదిలింది అనుకుంటే మరో సమస్య ఆమె కోసం ఎదురుచూస్తుంది.
మమతా మోహన్ దాస్ ఆటో ఇమ్యూన్ కి గురయ్యారు. అది బొల్లి వ్యాధికి దారి తీసింది. అందాన్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే హీరోయిన్స్ కి బొల్లి వ్యాధి రావడం ఆత్మహత్యా సదృశ్యం. ఆ విషయం తెలిశాక మమతా మోహన్ దాస్ పడిన మానసిక వేదన గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నేను మహేష్ మారుతియం షూటింగ్ టైం లో ఒంటి పై మచ్చలు గమనించాను. అవి ముఖం, చేతులు, మెడపై వ్యాపించాయి. పరీక్షల్లో బొల్లి వ్యాధి అని తేలింది. క్యాన్సర్ సోకినప్పుడు నా సమస్య మిత్రులతో, సన్నిహితులతో చెప్పుకున్నాను. అందరూ నాకు మద్దతిగా నిలిచారు. ఈ వ్యాధి గురించి బయట పెట్టలేకపోయాను. ఒంటరిని అయ్యాను. ఒక్కదాన్నే కూర్చొని ఏడ్చుకునే దాన్ని. మెడిసిన్ వాడుతుంటే ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. దీంతో మందులు తగ్గించాను.
ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఒంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమో అన్న భయం వేసింది. వెంటనే నాకు సోకిన బొల్లి వ్యాధి గురించి అందరికీ తెలిసేలా చేశాను. అప్పుడు కొంత ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు ఎవరైనా నీకు ఏమైందని అడిగితే... నా ఇంస్టాగ్రామ్ చూడమని చెబుతాను, అని మమతా మోహన్ దాస్ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
యమదొంగ మూవీలో మమతా మోహన్ దాస్ సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఓ పాటను ఎన్టీఆర్ తో పాటు స్వయంగా పాడారు. మమతా మోహన్ దాస్ ప్రొఫెషనల్ సింగర్ కూడాను. కింగ్ నాగార్జునతో కేడి, కింగ్ చిత్రాల్లో నటించారు. ఇక వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చింతకాయల రవి మూవీలో మమతా మోహన్ దాస్ అనుష్కతో పాటు మరొక హీరోయిన్ గా చేశారు.