ఎన్టీఆర్‌ 27వ వర్థంతి.. నివాళ్లు అర్పించిన తారక్‌, కళ్యాణ్‌ రామ్‌..

By Aithagoni RajuFirst Published Jan 18, 2023, 8:28 AM IST
Highlights

నందమూరి తారక రామారావు వర్థంతి నేడు(జనవరి 18). ఈ సందర్భంగా తాతకి నివాళ్లు అర్పించారు మనవళ్లు జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్థంతి నేడు(జనవరి 18). ఈ సందర్భంగా తాతకి నివాళ్లు అర్పించారు మనవళ్లు జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ని ఈ తెల్లవారు జామున సందర్శించిన ఈ ఇద్దరు తారలు ఎన్టీఆర్‌ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళ్లు అర్పించారు. తాతని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఎన్టీఆర్‌ 1923, మే 28న నిమ్మకూరులో జన్మించారు. జనవరి 18, 1996లో మరణించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి తరం నటుడిగా, లెజెండరీ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు ఎన్టీఆర్‌. తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్‌కి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించార. మూడు వందలకుపైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు వారి గుండెల్లో చిరంజీవిలా నిలిచిపోయారు. 

Exclusive Video From Both and paid tribute to Anna NTR Garu 🙏💐💐

Johar Anna NTR Garu pic.twitter.com/kJkDjVZ4W6

— NTR Royal Fans ™ (@NTRRoyalFans)

కృష్ణుడు అంటే ఇలానే ఉంటాడేమో అనే ఆయన పాత్రల్లో పరకాయప్రవేశం చేశారు. కృష్ణుడిగా, రాముడిగా, రావణుడిగా, భీష్ముడిగా ఇలా ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. పౌరాణికాలు, సాంఘీకాలు, జానపదాలు జోనర్‌ ఏదైనా పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోయడం ఎన్టీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు. 1949లో `మన దేశం`చిత్రంతో ప్రారంభమైన ఆయన సినిమా జీవితం, `మేజర్‌ చంద్రకాంత్‌`తో ముగిసింది. 

మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించారు నందమూరి తారకరామారావు. తెలుగుదేశం పార్టీని 1982లో ప్రారంభించి ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌కి సీఎం అయ్యారు. 1983 నుంచి 84 వరకు, 84 నుంచి 89 వరకు, 94 నుంచి 95 వరకు సీఎంగా చేశారు. మూడుసార్లు సీఎంగా తెలుగు రాష్ట్రానికి సేవలందించారు. అనేక పథకాలు ప్రారంభించి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని నందమూరి బాలకృష్ణ, జూఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా రాణిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ జన్మించి వందేళ్లు అవుతున్న సందర్భంగా గతేడాది నుంచి ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

click me!