`తారామణి` ఫేమ్ వసంత్ రవి, `గాయం2` ఫేమ్ విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `అశ్విన్స్`. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్వించారు. సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ముందుగానే ఆడియెన్స్ కి ప్రదర్శించి, మౌత్ పబ్లిసిటీతో హిట్లు కొడుతున్నారు మేకర్స్. ఇది నయా ట్రెండ్ ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ఫార్ములాగా మారింది. ఇటీవల `మేమ్ ఫేమస్` లాంటి సినిమా అలానే మంచి విజయాన్ని సాధించింది. తాజాగా `అశ్విన్స్` అనే మరో తెలుగు, తమిళం బైలింగ్వల్ సినిమా ముందుగానే ప్రదర్శించడం విశేషం. `తారామణి` ఫేమ్ వసంత్ రవి, `గాయం2`, `రంగా ది దొంగ` వంటి పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన విమలా రామన్ కథానాయికగా నటిస్తుంది. తరుణ్ తేజ్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 23న ఈ సినిమా రిలీజ్ కానుంది. ముందుగానే దీన్ని ప్రదర్శిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
undefined
అర్జున్(వసంత్ రవి), అతని మిత్రులు రాహుల్, వరుణ్, రితూ, గ్రేస్ ఐదుగురు కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ కు డార్క్ టూరిజం మీద ఓ ఎపిసోడ్ ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం ఓ దీవిలో ఉన్న ఓ పెద్ద భవంతిలోకి వెళతారు. అక్కడ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) అనే ఓ ఆర్కియాలజిస్ట్ ఆత్మ తిరుగుతోందని, ఆమె గతంలో ఓ పదిహేను మందిని చంపేసి అంతు చిక్కకుండా చేసిందనే ప్రచారం ఉండటంతో ఆ బంగ్లాని ఎంచుకుని అందులో సంచరించే ఆత్మలను, అరుపులను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. ఇలా వెళ్లిన ఆ ఐదుగురికి ఆ భవంతిలో కలిగిన వింత అనుభవాలు ఏమిటి? వీరు అనుకున్న పనిని పూర్తి చేసి బయటపడ్డారా? అందులో ఉన్న ఆత్మలకు కారణం ఏంటి? దాని బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ప్రస్తుతం ఉన్న సమాజంలో, సినిమాల పరంగా మంచి సందేశాన్ని ఓపెన్‌గా చెబితే ఆడియెన్స్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇలాంటివి చాలా చూశామనే మైండ్‌సెట్‌తో ఉన్నారు. సినిమాల్లో సందేశాలను కోరుకోవడం లేదు. ఎంటర్‌టైనర్‌మెంట్‌ని, థ్రిల్లింగ్ పాయింట్‌లను, గూస్ బంమ్స్ తెచ్చే యాక్షన్లు, ఎలివేషన్లని కోరుకుంటున్నారు. దీంతో ఏ సినిమా అయినా ఈ యాంగిల్స్ లో చెప్పాల్సి వస్తుంది. అందుకే షుగర్ కోటింగ్ తోనే సాధ్యం. `అశ్విన్స్` సినిమాలో హర్రర్, థ్రిల్లర్ అంశాలను షుగర్ కోట్‌గా వాడుకున్నారు దర్శకుడు తరుణ్ తేజ్. సైకలాజికల్ హర్రర్ మూవీలో అంతర్లీనంగా మంచి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశాడు. మనిషిలో రెండు కోణాలుంటాయని, ఒకటి మంచి వైపు, మరోకటి చెడువైపు నడిపించేదిగా ఉంటుందని, ఈ రెండింటిని నియంత్రించే శక్తి కూడా మనిషికే ఉంటుందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
మనిషి బుద్ధి మంచి వైపు వెళదామని చెబితే, మనసు మాత్ర చెడు వైపు చూయిస్తుంది. దానిని మనం ఎంతో నిగ్రహంతో మంచి వైపు ప్రయాణించడానికే ప్రయత్నించాలని ఇన్నర్ మెసేజ్ ని ఈ చిత్రంలో అందించారు. హర్రర్ ఎలిమెంట్లు భయపెడుతూనే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ నిస్తాయి. ఇందులో హర్రర్ పాళ్లు గట్టిగానే ఉంటాయి. ఆర్టిస్టుల్లో ఉండే భయం మనకు కొంత భయానికి గురి చేస్తూనే మరికొంత నవ్విస్తుంది. అయితే హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కథ సాగే విధానం ఒకేలా ఉంటుంది. కానీ దాన్ని ఎంగేజింగ్‌గా చేయడంలోనే సక్సెస్ ఉంటుంది. ఎంత ఎంగేజ్ చేస్తే అంతగా ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ సినిమాకి కనెక్ట్ అవుతారు. ఎండింగ్ వరకు ట్రావెల్ అవుతారు. కానీ ఈ సినిమాలో కొంత అసంతృప్టి ఉంది. రొటీన్ గా అనిపించడంతో ఆ కిక్ కొంత తగ్గింది.
వసంత్ రవి పోషించిన రెండు పాత్రల ద్వారా ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ హారర్ చిత్రాల్లోలాగే సాగుతుంది. ఓ పెద్ద భవంతిలోకి ఓ ఐదుగురు యువకులను తీసుకెళ్ళి అక్కడ చిత్ర విచిత్ర సౌండ్లతో ఆడియన్స్ ని హారర్ ఎత్తించడానికి చేసిన ప్రయత్నాలు ఓ మోస్తారుగా సక్సెస్ అయ్యాయి. అయితే సెకెండాఫ్ లో ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) చాప్టర్ తో అసలు సినిమా స్వభావం ఏంటో తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో భయపెట్టి సెకెండాఫ్ లో అసలు కథలోకి వెల్లడంతో ప్రేక్షకులు ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కి బాగా ఎంగేజ్ అవుతారు. సెకండాఫ్‌లో ఆద్యంతం ఎంగేజ్ చేసేలా సాగుతుంది. అది సినిమాకి పెద్ద ప్లస్ గా చెప్పొచ్చు. దీంతో చూడదగ్గ హర్రర్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది.
నటీనటులుః
మెయిన్ లీడ్ అర్జున్ పాత్రలో కనిపించిన హీరో వసంత్ రవి రెండు పాత్రలలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నారు. రెండు యాంగిల్స్ చూపించి మెప్పించింది. సినిమాకి హైలైట్‌గా నిలిచారు. విమలా రామన్ పాత్రకి మంచి ప్రాధాన్యతనే దక్కింది. ఆమె చాలా కాలం తర్వాత ఆర్కియాలజిస్టుగా మంచి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. మిగతా నాలుగు పాత్రలు ఓకే. ఇందులో డైరెక్టర్ రాజీవ్ మీనన్ కుమార్తె సరస్వతీ మీనన్ కూడా ఓ పాత్ర పోషించారు. ఆమె కూడా ఆకట్టుకునేలా చేసింది. మిగిలిన పాత్రలు నవ్విస్తూనే భయపెడుతుంటాయి. ఆయా పాత్రల్లో వారు మంచి ఆదరణ పొందుతారని చెప్పొచ్చు.
టెక్నీకల్‌గాః
తరుణ్ తేజ్ దర్శకుడిగా ఫర్వాలేదనిపించింది. ఉన్నంతలో కొత్తగా కథని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ స్క్రీన్‌ప్లే తీరు మాత్రం సేమ్ అనిపిస్తుంది. అది ఫస్టాఫ్‌ని మరింత గ్రిప్పింగ్‌గా చేయాల్సింది. కొన్ని ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెంచితే సినిమా ఆడియెన్స్ ని మరింతగా ఎంగేజ్ చేసేది. విజయ్ సిద్ధార్థ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో భయపెడుతుంది. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ సినిమా నిడివిని ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
ఫైనల్‌గాః హర్రర్, థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారికి నచ్చే చిత్రమవుతుంది. `ఏ`సర్టిఫికేట్ మూవీ కావడంతో చిన్నపిల్లలు సినిమాకి దూరంగా ఉండటం బెటర్.