తెలుగు రాష్ట్రాల్లో బయోపిక్ కి ఎదురుదెబ్బ!

By Udayavani DhuliFirst Published Dec 29, 2018, 11:49 AM IST
Highlights

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రభాస్ పాత్రలో నటించిన సినిమా 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రభాస్ పాత్రలో నటించిన సినిమా 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. సాధారణంగా తెలుగు డిస్ట్రిబ్యూటర్లు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ డేట్ కి ఇరవై రోజులు ముందుగానే బిజినెస్ మాట్లాడుకుంటారు.

ఈ సినిమా జనవరి 11న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు ఎవరూ సినిమాను కొనడానికి ముందుకు రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ మెంబర్ ముత్యాల రామదాసు ఈ విషయంపై స్పందిస్తూ.. ''చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా గురించి తెలియదు. పెద్ద బాలీవుడ్ స్టార్లు నటించే సినిమాలను తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపిస్తుంటారు. 

పైగా సినిమా రిలీజ్ అయ్యేది సంక్రాంతి సీజన్.. ఆ సమయంలో 'ఎన్టీఆర్' బయోపిక్, రామ్ చరణ్ 'వినయ విధేయ రామ', వెంకటేష్-వరుణ్ తేజ్ ల 'ఎఫ్ 2', రజినీకాంత్ 'పేటా' సినిమాలు ఉన్నాయి. కాబట్టి 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమవుతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వివాదాలకు దారి తీసింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సినిమా విడుదలపై నిషేధం విధించాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే వాస్తవాలను వక్రీకరించినట్లుందని, సినిమాను ముందే ప్రదర్శించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

click me!