
నందమూరి-మెగా అభిమానుల మధ్య వైరం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతుంది. దాన్ని రాజమౌళి సైతం దూరం చేయలేరని నిరూపితమైంది. అసలు ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారన్న వార్తే ప్రకంపనలు రేపింది. ఇదెలా సాధ్యం, తేడా కొడితే గొడవలు ఖాయమానుకున్నారు. ఎవరిని తక్కువ చేసి చూపించినా ఫ్యాన్స్ నుండి రాజమౌళి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రాజమౌళికి పెద్ద ఛాలెంజ్. కారణం హీరోలు ఎవరైనా సినిమాకు కథ, కథనాలే ప్రాణం.
ఒక మల్టీస్టారర్ చేస్తున్నప్పుడు ఇద్దరు హీరోలకు సీన్స్, సాంగ్స్, ప్రాధాన్యత కొలిచి మరీ తెరకెక్కించలేం. అలా చేస్తే అది సినిమా ఎలా అవుతుంది? ఎమోషనల్ ఎలా పండుతుంది? ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య మూవీ తీసుకుంటే... రవితేజ పాత్రకు బాగా వెయిట్ ఇచ్చారు. రవితేజ పాత్ర ముందు చిరంజీవి తగ్గి నటించాడు. అది తమ్ముడి మీద అన్నయ్యకున్న ప్రేమగా దర్శకుడు ప్రేక్షకులను కన్విన్స్ చేశాడు. చిరంజీవి-రవితేజల ఇమేజ్, స్టార్డమ్ లో చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఇద్దరూ కథలో భాగమై నటించారు.
ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే... రాజమౌళి ఫ్యాన్స్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకొనే చరణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ డిజైన్ చేశాడు. ఆయనకో ఇంట్రో ఈయనకో ఇంట్రో, సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ పాత్రను చరణ్ గైడ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. రామ్ చదువుకున్న పోలీస్, భీమ్ గోండు జాతి అడవి బిడ్డ. బహుశా అందుకే రాజమౌళి భీమ్ పాత్రను ఇన్నోసెంట్ గా, రామ్ ని ఇంటెలిజెంట్ గా చూపించి ఉండొచ్చు. అలాగే చరణ్ పాత్రలో ఉన్నన్ని షేడ్స్ ఎన్టీఆర్ పాత్రలో లేవు. అయినప్పటికీ ఎన్టీఆర్ కి కూడా రాజమౌళి అద్భుతమైన సీన్స్ రాశారు.
ఇక సినిమా విడుదలైనప్పటి నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. మా వాడు గొప్పంటే మావాడు గొప్పంటూ, వాదులాడుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానుల చౌకబారు చర్యలు అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యాయి. HCA వంటి సంస్థ సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అంటూ చరణ్ ఫ్యాన్స్ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ 'టాక్ ఈజీ విత్ సామ్ ప్రాగోసో' షోలో పాల్గొన్నారు.
ఈ షోలో హోస్ట్ ఎన్టీఆర్ ని సైడ్ యాక్టర్ అని పిలిచినట్లు ఎగతాళి చేస్తూ చరణ్ ఫ్యాన్స్ ఒక ఎడిట్ వీడియో వైరల్ చేస్తున్నారు. దానికి కౌంటర్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒరిజినల్ వీడియో బయటకు తీశారు. హోస్ట్ ఎన్టీఆర్ ని సైడ్ యాక్టర్ అనలేదు, చరణ్ తో పాటు నటించిన(అలాంగ్ సైడ్ యాక్టర్) నటుడు అన్నాడు. చరణ్ ఫ్యాన్స్ ఎడిట్ చేసి దాన్ని... సైడ్ యాక్టర్ అని ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరో రెండు రోజుల్లో ఆస్కార్ వేడుక జరగనుండగా ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్... సోషల్ మీడియాలో దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారు.