Nayeem diaries trailer: ఉద్యమంలోనుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం.. చివరగా నక్సల్స్ గానే ఉండాలనుకున్నాడా?

By Aithagoni RajuFirst Published Nov 16, 2021, 6:57 PM IST
Highlights

సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన నయీం జీవితం ఆధారంగా తాజాగా `నయీం డైరీస్‌` అనే సినిమా వస్తోంది. దాము బాలాజీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నయీం పాత్రలో వశిష్ట సింహ నటిస్తున్నారు. సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. 

మావోయిస్ట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం(Nayeem) రాష్ట్రంలో ఎంతటి సంచలనాలను సృష్టించారో తెలిసిందే. ఉద్యమకారుడిగా ఎదిగి, అట్నుంచి పోలీసులకు కోవర్ట్ గా మారిపోయి నక్సల్‌ కార్యకలాపాలను పోలీసులకు చేరవేస్తూ, అట్నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు నయీం. పోలీసులు పెంచి పోషించిన గ్యాంగ్‌స్టర్‌ Nayeem ఆగడాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఐదేళ్ల క్రితం ఆయన్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. నయీం ఎన్‌కౌంటర్‌ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక కొత్త విషయాలు బయటకు వచ్చాయి. నయీంతో రాజకీయ నాయకులు, పోలీసులకు ఉన్న సంబంధాలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఈ కేసుని జాగ్రత్తగా క్లోజ్‌ చేశారు పోలీసులు.

ఇంతటి దుమారం రేపి, సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన నయీం జీవితం ఆధారంగా తాజాగా `నయీం డైరీస్‌`(Nayeem Diaries) అనే సినిమా వస్తోంది. దాము బాలాజీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నయీం పాత్రలో వశిష్ట సింహ నటిస్తున్నారు. సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. సోమవారం దర్శకుడు సంపత్‌ నంది Nayeem Diaries Trailer ని ఆవిష్కరించారు. ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నయీం చేసిన కార్యకలాపాలను ఇందులో యదాతథంగా చూపించబోతున్నట్టు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. నయీం ఎన్‌కౌంటర్‌ నుంచి ట్రైలర్‌ ప్రారంభమైంది. `నువ్వు రక్తం మరిగిన రాక్షసుడిగా తయారయ్యావు నయీం..` అని నక్సల్‌ నేత అనగా.., అతన్ని కాల్చేస్తాడు నయీం. `ద్రోహుల రక్తంతో విప్లవం ఎరుపెక్కుతుంది..` అని మరో విప్లవకారుడు అనడంతో `ఐ హేట్‌ పోలీస్‌..` అని నయీం కోపంతో ఊగిపోతాడు. జైల్లో పోలీసులతో గొడవ పడుతుంటాడు. 

మరోవైపు `నువ్వు తెలంగాణ ద్రోహివి అవుతావు` అని రాజకీయ నాయకుడు అనడం, `బతికేవాడికి భయముంటుందేమో గానీ, పోరాడే వాడికి ఉండదు సర్‌`, `ముళ్లుని ముళ్లుతోనే తీయాలి`, `పార్టీ అంటే నాకు కన్న తల్లికంటే ఎక్కువే అన్నా` నయీం చెప్పడం ఆకట్టుకుంటుంది. `నువ్వు నడుస్తున్న చరిత్రవి` అని మరో విప్లవకారుడు చెప్పడం, నయీం దౌర్జాన్యాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ధర్నాలు చేయడం, అనంతరం నయీం నక్సల్స్ కి వ్యతిరేకంగా పనిచేయడం, వారిని చంపేందుకు పోలీసులతో కుట్రలు చేయడం, `ఐ హేట్‌ నక్సలైట్‌` అంటూ చెప్పడం కళ్లకి కట్టినట్టు చూపించారు. నయీం చేసిన దుర్మార్గాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.

ఓ వైపు నక్సల్స్ కి మద్దతుగా నిలుస్తూ పోలీసులను, పోలీసులకు మద్దతుగా నిలుస్తూ నక్సల్స్ ఏరివేతకు కారణమయ్యాడనేది, అట్నుంచి సొంతంగా గ్యాంగ్‌ స్టర్‌గా ఎదగడం, ఈ క్రమంలో అనేక మందిని చంపేయడం, దోచుకోవడం, అమ్మాయిలతో గడపడం వంటివి ఇందులో చూపించారు. చివరికి పోలీసులా, నక్సలైట్లా అంటే మాత్రం తాను నక్సలైట్లనే ఎంచుకుంటా అని చివర్లో చెప్పడంతో నయీం చివరి రోజుల్లో నక్సల్స్ కి మద్దతు దారుడిగా నిలిచాడనే విషయాన్ని తెలియజేశారు. మొత్తంగా నయీం జీవితంలోని రెండు కోణాలను `నయీం డైరీస్‌` చిత్రంలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. వశిష్ట ఎన్‌ సింహా ప్రధాన పాత్రతోపాటు దివి, బాహుబలి నిఖిల్‌, యజ్జ శెట్టి, సంయుక్త హార్న్‌డ్, శశి కుమార్‌, దేవి ప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు. ఇది త్వరలో విడుదల కాబోతుంది. 

also read: ‘గుడ్‌లక్‌’ కేవలం టైటిల్ లోనేనా?లేకపోతే ఇదేంటి మళ్లీ
 

click me!