
సినిమాకు మించిన నాటకీయత నిజ జీవితాల్లో ఉంటుంది. మన ఎంచుకున్న దారికి చేరుకున్న లక్ష్యానికి ఒక్కోసారి పొంతన ఉండకపోవచ్చు. అలా హీరోలు కావాలని వచ్చి డైరెక్టర్స్... డైరెక్టర్స్ అవుదామనుకుని హీరోలు, నటులు అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారిలో హీరో నాని ఒకరు. మెగా ఫోన్ పట్టుకొని కెమెరా వెనకుండి యాక్షన్ అని చెప్పాలనుకున్న నాని... కెమెరా ముందుకొచ్చి హీరో అయ్యాడు. ఇక నాని ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. ఎలాంటి సినిమా నేపథ్యంలో లేకుండా టాలెంట్, హార్డ్ వర్క్ తో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్నారు.
కృష్ణాజిల్లాలో పుట్టిన నాని ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్ లో జరిగింది. సిటీ లైఫ్ స్టైల్ సినిమా మీద మక్కువ పెరిగేలా చేసింది. పెద్ద డైరెక్టర్ అయిపోవాలని కలలు కన్నాడు. పరిశ్రమ అనే సముద్రంలో అనేక కలలతో అడుగుపెట్టాడు. ముందు పని నేర్చుకోవాలి కాబట్టి, సెట్లో చెప్పిన పనులన్నీ చేశేవాడు. క్లాప్ బోర్డు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. కొంచెం అనుభవం వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. బాపు, శ్రీనువైట్ల వంటి దర్శకుల వద్ద పనిచేశారు.
అనూహ్యంగా హీరో ఎందుకు కాకూడదనే ఆలోచన చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితుల కారణంగా మనసులో చోటు చేసుకుంది. అందుకు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఊతం ఇచ్చారు. ఒక పల్లెటూరి విలేజ్ యువకుడు పాత్రకు నాని సరిపోతాడని హీరోగా ఎంపిక చేసుకున్నాడు. అలా అష్టా చెమ్మా మూవీతో నాని హీరో అయ్యాడు. 2008లో విడుదలైన ఆ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
స్నేహితుడు అనే మరో చిన్న సినిమాతో నాని అద్భుతం చేశాడు. అలా మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల కంట్లో పడ్డాడు. నానికి ఫేమ్ తెచ్చిన మొదటి సినిమా అలా మొదలైంది. పిల్ల జమిందార్ తో మరో హిట్. ఈ క్రమంలో ఏకంగా రాజమౌళి మూవీలో ఛాన్స్ కొట్టేశాడు. ఆయన ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈగ మూవీలో లవర్ బాయ్ రోల్ చేశాడు. చిన్న పాత్ర అయినా పెద్ద పేరు తెచ్చింది. హీరోగా గట్టి పునాది వేసింది. అయితే రాజమౌళి సెంటిమెంట్ నానిని కూడా వదల్లేదు. రెండు మూడేళ్లు వరుస ప్లాప్స్ పడ్డాయి.
ఇక నాని పని అవుట్ అనుకుంటున్న తరుణంలో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. భలే భలే మగాడివోయ్, జెంటిల్ మెన్ చిత్రాలతో సూపర్ హిట్స్ ఇచ్చాడు. తనకంటూ మార్కెట్, ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకొని స్టార్స్ లిస్ట్ లో చేరాడు. నటుడిగా 15 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు. తన సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ నాని ప్రధాన బలాలు. 1984 ఫిబ్రవరి 24న జన్మించిన నాని 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. ఇక ఆయన లేటెస్ట్ మూవీ దసరా మార్చి 30న విడుదల కానుంది.