
చిత్ర పరిశ్రమలో ఇటీవల తరచుగా విషాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో విషాదకర సంఘటన చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది. కన్నడ ప్రముఖ సింగర్ షిమోగా సుబ్బన్న(83) గురువారం రాత్రి కన్నుమూశారు.
ఆయన మరణవార్త కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తం దిగ్బ్రాంతికి గురైంది. కన్నడ సినిమా పాటకు జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన గాయకుడు ఆయన. గురువారం సుబ్బన్న గుండెపోటుకి గురి కావడంతో కుటుంబ సభ్యులు బెంగుళూరులోని జయదేవ ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బన్న తుదిశ్వాస విడిచారు. ఆయన గాయకుడు మాత్రమే కాదు అడ్వకేట్ కూడా. శాండల్ వుడ్ లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడు సుబ్బన్న. 1978లో 'కాదే కుదిరి ఒడి' అనే పాటతో సుబ్బన్నకు నేషనల్ అవార్డు దక్కింది.
‘బారిసు కన్నడ డిండిమావ’అనే పాటతో సుబ్బన్న గాయకుడిగా పాపులర్ అయ్యారు. 2008లో కువెంపు యూనివర్సిటీ సుబ్బన్నకి గౌరవ డాక్టరేట్ అందించింది. ఆకాశవాణి, దూరదర్శన్ లో అనేక కార్యక్రమాలకు సుబ్బన్న పాటలు పాడారు. సుబ్బన్న మృతితో కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.