
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వైద్యులు తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వైద్యులు ఆయనకు మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. ఆయనను కోమా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత 22 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బ్రెయిన్‌కు సంబంధించిన పరీక్షల ఫలితాలు ఈరోజు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న బాబాయి నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈరోజు బెంగళూరుకు చేరుకున్నారు. వీరు కాసేపట్లోనే నారాయణ హృదయాలయకు చేరుకోనున్నారు.
అయితే తారకరత్న ఆరోగ్యంపై తొలుత హెల్త్ బులిటెన్‌లు విడుదల చేసిన ఆస్పత్రి యజమాన్యం.. ఆ తర్వాత ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుంటున్న సమయంలో.. ఈ రోజు సాయంత్రం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన తారకరత్న గుండెపోటుతో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదలయా ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉన్నారు.