నా పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నా.. అందుకు చాలా బాధపడ్డాను: నందమూరి బాలకృష్ణ

By Sumanth KanukulaFirst Published Jan 15, 2023, 10:57 AM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.  ఈ క్రమంలోనే తన కామెంట్స్‌పై బాలకృష్ణ స్పందించారు. 
 

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. తాజాగా వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ..  దేవ బ్రాహ్మణులకు దేవల మహర్షి గురువు.. ఇక దేవల మహర్షికి నాయకుడు ఆ రావణాసురుడు అని చెప్పారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను దేవాంగ కులస్తులు తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన వ్యాఖ్యలపై స్పందించారు. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అనేది తప్పుడు సమాచారం అని అన్నారు. అది దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని చెప్పారు. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్టుగా కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి.. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. 

Also Read: కులాన్ని కించపరిచారు క్షమాపణలు చెప్పాలి... వివాదంలో బాలయ్య కామెంట్స్ 

దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి.. పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు .. నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా?. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’’అని బాలకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇక, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై దేవాంగ కులస్తుల తప్పుపట్టారు. దేవల మహర్షికి నాయకుడు రావణాసురుడని చెప్పి బాలకృష్ణ చరిత్ర వక్రీకరించారని మండిపడుతున్నారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దేవాంగ కులానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు. 

click me!