ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు సంబంధించిన వివాదంపై నాగార్జున మరోసారి స్పందించారు. తప్పుడు వార్తల ప్రచారం నేపథ్యంలో ఆయన హాట్ కామెంట్ చేశారు.
హీరో నాగార్జునకి చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. శనివారం ఉదయం హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్‌ని కూల్చేసిన విషయం తెలిసిందే. తుమ్మిడికుంట చెరువుని ఆక్రమించిన ఆరోపణలతో అధికారులు ఎన్ కన్వెన్షన్‌ని కూల్చేశారు. దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమా సెలబ్రిటీకి చెందిన కన్వెన్షన్ కావడంతో బాగా హాట్ టాపిక్ అయ్యింది. ఇది రాజకీయంగానూ దుమారం రేపుతుంది.
కూల్చివేసిన అనంతరం నాగార్జున స్పందిస్తూ, కూల్చివేత అక్రమం అని, ఎలాంటి లీగల్ నోటీసులు లేకుండా కూల్చివేశారని, కేసు కోర్ట్ లో ఉందని, ఈ వివాదంపై కోర్ట్ స్టే విధించిందని, కానీ చట్టాన్ని అతిక్రమించి కూల్చివేశారని తెలిపారు నాగార్జున. దీనిపై కోర్టుకి వెళ్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే కోర్ట్ ని ఆశ్రయించగా, కూల్చివేతపై స్టే విధించింది కోర్ట్. ఈ మేరకు కోర్ట్ నోటీసులు కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించిన ఎవరినీ వదలమని, అది ఎంత పెద్ద నాయకుడైనా, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తి అయినా, ప్రజలను ప్రభావితం చేసే పాపులర్ వ్యక్తులనైనా వదిలేది లేదని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడిని పట్టించుకోమని, కఠినంగానే వ్యవహరిస్తామని తేల్చి చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేశాయి. మరోవైపు దీనిపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సైతం స్పందించారు. ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు విమర్శలు చేశారు. నాగ్‌పై బీజేపీ విమర్శలు చేసింది.
లేటెస్ట్ గా దీనిపై నాగార్జున స్పందించారు. ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణంపై మీడియాలో, సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో నాగ్ స్పందించి హెచ్చరించారు. పుకార్లని ప్రచారం చేయొద్దని, తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని వెల్లడించారు. సెలబ్రిటీలంటే మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని, హైలైట్ చేస్తుందని, కానీ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు నాగ్. సెంటు భూమి కూడా ఆక్రమించలేదని, పట్టా భూమిలోనే కన్వెన్షన్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. 2014లోనే స్పెషల్ కోర్ట్ తుమ్మిడికుంట చెరువులో ఆక్రమణలు జరగలేదని తేల్చి చెప్పిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కేసు కోర్ట్ లో ఉందని, తమ వాదనలు వినిపించామని, కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నాగార్జున వెల్లడించారు. దీంతో ఈ వివాదం మరింత రచ్చ అవుతుంది. అయితే నాగ్ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.