
మెగా కుటుంబంలో మరో జంట విడాకులకు సిద్ధమైంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు కోరుతూ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం విడాకులు కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని జైపూర్‌లో చైతన్య, నిహారికల విహహం అంగరంగ వైభవంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఈ జంట ఒక్కటైంది. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ తర్వాత మనస్పర్థలు ప్రారంభమైనట్లుగా చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. తొలుత వీటిని పుకార్లుగొ కొట్టేసినప్పటికీ.. తర్వాత కొన్నిరోజులకే తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిహారికకు సంబంధించిన ఫోటోలను చైతన్య తొలగించడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకే నిహారిక కూడా తన భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీల్ చేయడం, మెగా కుటుంబంలో జరిగిన శుభకార్యాలకు నిహారిక సింగిల్‌గా రావడంతో విడాకులు కన్ఫర్మ్ అని తేలిపోయింది.
అయితే ఇరు కుటుంబాల్లోని పెద్దలు వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో చివరికి విడాకులు తీసుకునేందుకే ఈ జంట సిద్ధమైంది. విడాకులకు నిహారిక స్వయంగా దరఖాస్తు చేయడంతో వీరి విడాకులు ఖాయమైపోయాయి. అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన నిహారిక, చైతన్యల పెళ్లి.. మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోవడంతో మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.