
ఎపిసోడ్ ప్రారంభంలో మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి బయటకు వచ్చేసరికి నేను ఉండను అని మురారితో అంటుంది కృష్ణ. ఎందుకు అని మురారి అడగగా, నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను మీరే కదా నాకు ధైర్యం చెప్పారు ఆ ధైర్యంతోనే ముందడుగు వేస్తున్నాను అంటుంది కృష్ణ. నాకు నీ మీద నమ్మకం ఉన్నది అని చెప్పి కృష్ణని నవ్వుతూ పంపిస్తాడు మురారి. బయటనుంచి ముకుంద ఈ మాటలన్నీ విని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
కృష్ణ హాస్పిటల్ కి వచ్చేసరికి గౌతమ్ ని గుద్దుకోబోతుంది ఇంతలో గౌతమ్ అడ్డుకుంటాడు. టైం ఎంత అయింది అని అనగా సారీ సార్ కొంచమే కదా లేట్ అయింది. అయినా ఎందుకు నిమిషం లేటుగా వచ్చినా సరే టైం ఎంత అయింది అని చెప్పి గంభీరంగా అడుగుతారు. ఇంతకీ నాకు ఒక ప్రశ్న ఉంది మనం మర్యాదని ఎలా తీసుకోవాలి సార్ అని అనగా పనిచేస్తే వస్తుంది అని అంటాడు గౌతమ్. మరి ఆ పని ఏదో నాకు ఇవ్వొచ్చు కదా ఇలా పనిష్మెంట్లు ఇచ్చే బదులు.
నేను ఆ గౌరవాన్ని ఏదో తీసుకుంటాను అని అంటుంది కృష్ణ. ఇప్పటివరకు నీకు చెప్పింది పనే. నీ ఓపికని, పేషెంట్ల పట్ల నీ ప్రవర్తనని గమనించడానికి ఇన్ని రోజులు ఇలా చేయించాను. ఇప్పటినుంచి నీకు అసలు పని చెప్తాను అని అంటాడు గౌతమ్. థాంక్యూ సర్ అని కృష్ణ ఏదేదో మాట్లాడుతూ ఉండగా, నువ్వు అలా మాట్లాడుతూనే ఉంటావా? కొంచెం నెమ్మదిగా మాట్లాడు అలా బుర్ర తినొద్దు నేను కాఫీ తాగి వస్తాను అని గౌతమ్ అనగా నేను వస్తాను అని అంటుంది కృష్ణ. మరి బిల్లు నువ్వే కట్టాలి అని చెప్పి కృష్ణను తీసుకొని వెళ్తాడు గౌతమ్.
మరోవైపు మురారి రెడీ అవుతుండగా కృష్ణ తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటాడు. ఏంటో కృష్ణ లేకపోతే గది బోసిపోయింది అనుకుంటాడు మురారి. మరోవైపు ముకుంద జరిగిన విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఎందుకు మురారి అలా ప్రవర్తిస్తున్నాడు. ఆదర్ష్ ని దూరం చేసానన్న దానివల్లే నాతో ఇలా ఉంటున్నాడా? అయినా కృష్ణ మీద అంత ప్రేమతో మాట్లాడడానికి కారణం గురుభక్తా?
లేకపోతే పక్క పక్కనే ఉంటూ సహజంగా వచ్చిన చనువా, అయినా మురారి కి ఎందుకు నా ప్రేమ అర్థం కావడం లేదు, ఎప్పటికి అర్థం చేసుకుంటాడు నేను ఇలాగే వదిలేయకూడదు అని చెప్పి మురారి ఫోటో ని చూస్తూ, మురారి నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను నా ప్రేమ ఎప్పటికీ చావదు అని అనుకుంటుంది. ఇంతలో మురారి కార్ తీసి బయలుదేరుతూ ఉండగా ముకుంద ఆపి ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు.
నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసు కదా నువ్వు మారిపోయావు అని అనగా పెళ్లయిన తర్వాత ఎవరైనా మారుతారు అని అంటాడు మురారి. మరి నేను మారలేదు కదా పెళ్లికి ముందు నిన్ను ఎంతలా ప్రేమించానో ఇప్పుడు అంతే ప్రేమిస్తున్నాను. నీకు ఏమాత్రం నా మీద ప్రేమ లేదా ఇప్పుడు అని అంటుంది ముకుంద. గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాను ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. మన జీవితాలు ఇలా ఉండడానికి కారణం నేనే కదా.
అయినా నేను నిన్ను ఎంత ప్రేమించానో ఆదర్శ్ కూడా నిన్ను అంతగానే ఇష్టపడ్డాడు. నీకు ఆదర్ష్ తో పెళ్లి చేస్తే అప్పుడు నువ్వు తన ప్రేమ అర్థం చేసుకొని మీ ఇద్దరూ నా కళ్ళముందు ఆనందంగా ఉంటారు అనుకున్నాను కానీ నువ్వు అలా చేయడం లేదు అని అంటాడు. నేను ఎందుకు అలా చేస్తాను నాకు నువ్వే కావాలి. నేను నీ మీద ప్రేమ ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను అని అంటుంది ముకుంద. నేను నీకు ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడి నుంచి నువ్వు మన గతంలో జరిగిన విషయాలన్నీ మర్చిపో.
నాకు ఎప్పటికీ నువ్వు ఆదర్ష్ భార్యలా మాత్రమే కనిపిస్తావు అని చెప్పి అక్కటినుంచి వెళ్ళిపోతాడు మురారి. ఆ తర్వాత సీన్లో కృష్ణ, గౌతమ్ ఇద్దరూ టీ తాగుతూ ఉండగా నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి సర్ ఇలాగ మా ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నది అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్పి తను ఈ టాబ్లెట్లు వాడడం వల్ల అలా అవుతుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పి టాబ్లెట్లు ఫోటోని తనకి ఇస్తుంది కృష్ణ. ఆ టాబ్లెట్లు చూసిన గౌతమ్ ఆశ్చర్యపోతాడు.
ఆ అమ్మాయిని నయం చేద్దామనుకుంటున్నారా లేకపోతే గతం మర్చిపోయేలా చేద్దాం అనుకుంటున్నారా అంత డోస్ వేస్తే నరాలు చిట్లిపోయి కోమాకు వెళ్ళిపోతారు అని అంటాడు. నందిని కి అంత పని జరుగుతుందా, నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను ఇంత డోసు వద్దు అని కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అని అంటుంది కృష్ణ. పేరేమన్నావు? అని గౌతమ్ ఆశ్చర్యంగా అనగా నందిని అని అంటుంది కృష్ణ. మీ ఇంటి అడ్రస్ ఏంటి అని అనగా తన ఇంటి అడ్రస్ చెప్తుంది కృష్ణ.
దానికి ఆశ్చర్యపోతాడు గౌతమ్ ఎందుకు సార్ అలా ఉన్నారు అని కృష్ణ అంటే ఏమీ లేదు ఆ అమ్మాయి నాకు పేషెంట్ అనుకున్నాను కానీ కాదు ఇప్పటినుంచి నేను ఇచ్చిన మందులే వాడండి ముందు ఈ మందులను ఆపండి తన ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటాడు. ఓకే సార్ థాంక్యూ అని అంటుంది కృష్ణ. తర్వాత భాగంలో కృష్ణ, మురారి పానీపూరి తింటూ ఉండగా ఇంతలో ముకుంద వాళ్ళ మధ్యలోకి వస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.