మూడు వర్గాలు.. లోకల్, నాన్ లోకల్ ఫీలింగులు: జనరల్ ఎలక్షన్స్‌ని తలపిస్తోన్న ‘‘మా’’ ఎన్నికలు

By Siva KodatiFirst Published Jun 23, 2021, 2:36 PM IST
Highlights

జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు. మా అధ్యక్ష ఎన్నికలు టాలీవుడ్‌ను మూడు వర్గాలుగా చీల్చింది. ప్రకాశ్‌రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్ధతు పలుకుతుంటే.. మంచు విష్ణుకు కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ మద్ధతు పలుకుతున్నారు. 

జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు. మా అధ్యక్ష ఎన్నికలు టాలీవుడ్‌ను మూడు వర్గాలుగా చీల్చింది. ప్రకాశ్‌రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్ధతు పలుకుతుంటే.. మంచు విష్ణుకు కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ మద్ధతు పలుకుతున్నారు. నాగార్జున మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇరు వర్గాలు పోటాపోటీగా సన్నాహలు చేస్తుంటే తాజాగా మూడో అభ్యర్ధిగా జీవిత రాజశేఖర్ రంగంలోకి దిగారు. దీంతో మా ఎన్నికలు మూడు ముక్కలాటగా మారాయి.

మరోవైపు కరోనా కారణంగా మా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ జారీ కాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఇరు వర్గాలు అధ్యక్ష పదవికి పోటీ పడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. నిజానికి ఈ అసోసియేషన్ పేద కళాకారులకు సహాయం చేయడానికి ఏర్పడింది. ఆర్ధిక, ఆరోగ్య పరమైన వెసులుబాటు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. కాగా.. దీనిని పక్కకుబెట్టి ఫండ్ రైజింగ్ కోసం చేసే కార్యక్రమాల్లో వివాదాస్పదంగా మారింది మా అసోసియేషన్.

ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీకి సిద్ధం కాగా, జీవిత రాజశేఖర్ పేరు తెరపైకి రావడంతో ఈ పోటీ ముక్కోణపు పోటీగా మారింది. గతంలో జీవితా రాజశేఖర్‌ మా సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. అధ్యక్ష పదవిలో తాను ఉంటే ఇంకా ఎక్కువగా సేవ చేయగలననే ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారు. జీవిత ఓ నటిగా, మా అధ్యక్ష పదవికి పోటీపడితే ఈసారి ఎన్నికలు చాలా వాడి, వేడిగా మారడం ఖాయమంటున్నారు.

ALso Read:`మా` ఎన్నికల బరిలో మంచు విష్ణు.. విలక్షణ నటుడితో ఢీ.. రసవత్తరంగా ఎన్నికలు

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మా కార్యవర్గంలో చోటు సంపాదించాలని చాలా మంది నటుల కల. భారీగా ఆదాయం, నిధులు, పవర్‌ఫుల్‌గా వుండే పదవి. ఇలాంటి అంశాలు ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. గత ఎన్నికల్లో మా కార్యవర్గ ఎన్నికలు గందరగోళ పరిస్ధితుల మధ్య జరిగాయి. గత హయాంలో మాలో జరిగిన కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, నిధుల్లో అక్రమాలు, ఆ సంఘానికి వున్న ప్రతిష్టను మసకబారేలా చేశాయి. మా కార్యవర్గంలో ఉన్నత పదవులు చేపట్టిన కొందరు చౌకబారు ఆరోపణలు చేసుకుంటూ మీడియాలో ఎక్కడం అత్యంత వివాదాస్పదం అయ్యాయి.

నడిగర్ సంఘంలో జరిగినట్లే ఇక్కడ కూడా లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కూడా వివాదానికి కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మా ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నడ నటుడైన ప్రకాశ్ రాజ్ టాలీవుడ్‌ను నడిపిస్తారా అని కొందరు ప్రశ్నిస్తుండగా.. స్థానిక నటులు మాను నడపటానికి పనికిరారా అని నిలదీస్తున్నారు. అనుభవం లేకుండా మాను మంచు విష్ణు నడపగలరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కన్నడిగుడైనా తెలుగు నటుడేనని నాగబాబు వర్గం అంటోంది. రాజశేఖర్ మాత్రం తమిళుడు కాదా అని అంటోంది. 
 

click me!