
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'లూసిఫర్'. మార్చి 28న కేరళలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మోహన్ లాల్ కి తెలుగులో కూడా క్రేజ్ ఉండడంతో ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూసినంత సేపు చాలా ఆసక్తికరంగా సాగింది. ఓ రాజకీయ పార్టీ అధినేత మరణిస్తే.. ఆయన స్థానాన్ని దక్కించుకోవడం కోసం కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుంటారు.
రాబందుల్లాంటి వారి చేతుల్లోకి పార్టీ వెళ్లకుండా స్టీఫెన్ (మోహన్ బాబు) అనే వ్యక్తి రంగంలోకి దిగుతాడు. అతడు ఎంట్రీ ఇచ్చిన తరువాత కథ మొత్తం మారిపోతుంది. ఆ విషయాలను తెరపైనే చూడాలని అంటోంది చిత్రబృందం.
మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ వంటి తారలు నటించిన ఈ సినిమాకి పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా.. దీపక్ దేవ్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.