చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ గురించి కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. క్రేజీ విషయాన్ని లీక్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి రేపు గురువారం(ఆగస్ట్ 22) 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన 155 సినిమాల్లో నటించారు. నాలుగున్నర దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఒక మహావృక్షంలాగా ఎదిగారు. ఎంతో మందికి నీడనిస్తున్నారు. ఆయన తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి దాదాపు పది మంది హీరోలు రావడం విశేషం. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది స్ఫూర్తిగా నిలిచారు, వారిని ఎంకరేజ్ చేస్తున్నారు చిరు.
ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. దీనికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్. ఆమెతోపాటు మీనాక్షి చౌదరి, సురభి, మృణాల్ ఠాకూర్, ఇషా చావ్లా ఇలా ఐదుగురు హీరోయిన్లు చిరుకి చెళ్లెళ్లుగా కనిపిస్తారట. గ్లామర్ పరంగా కొదవలేదని తెలుస్తుంది. అదే సమయంలో భారీ కాస్టింగ్ కూడా ఉంటుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
సోషియో ఫాంటసీ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు వశిష్ట. `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `బింబిసార` తరహాలో సాగుతుందని, టైమ్ ట్రావెల్ కథ అని చిత్ర యూనిట్ నుంచి తెలుస్తున్న సమాచారం. అంతేకాదు చిరంజీవి ఇందులో రెంగు గెటప్పుల్లో కనిపిస్తారని కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి క్రేజీ విషయాలను బయటపెట్టారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఈ మూవీకి ఆయన సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలోకి కీరవాణి వచ్చారు. చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
`విశ్వంభర` చిత్రం గురించి చెబుతూ, మరో `ఘరానా మొగుడు` లాంటి చిత్రం అని తెలిపారు. అప్పటి చిరంజీవిని మరోసారి చూస్తారని, అభిమానులకు అది ఫీస్ట్ అని చెప్పాడు కీరవాణి. ఆ సినిమాలో ఎంతగా ఎంటర్‌టైన్ చేశాడో, అదే రకమైన వినోదాన్ని ఇందులో పంచబోతున్నాడని, కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని, రెండు మూడు గంటలు టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఆనందించేలా ఉంటుందని, దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఉంటుందన్నారు కీరవాణి.
చిరంజీవి గొప్పతనం గురించి చెబుతూ, ఘరానా మొగుడు సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. కె రాఘవేంద్రరావు దర్శకుడు. ఆ సినిమా రిలీజ్‌కి ముందు సెట్‌కి కీరవాణి భార్యతో సహా వెళ్లాడట. ఆ సమయంలో తమని పలకరించిన విధానం, తన భార్యని పలకరించి, రండి అమ్మ, కూర్చొండి అని చెప్పి రిసీవ్ చేసుకున్న విధానం, డౌన్ టూ ఎర్త్ లో వ్యవహరించిన విధానం చూసి ఆశ్చర్యమేసింది. చిరంజీవి అంటే ఇంత డౌన్ టూ ఎర్త్ ఉంటారా? ఇంతటి రెస్పెక్ట్ ఇస్తారా అని ఆశ్చర్యపోయాడట కీరవాణి. అదే చిరంజీవిని ప్రత్యక్షంగా కలవడం మొదటిసారి. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. ఇప్పటికీ అదే రెస్పెక్ట్ ఆయనలో ఉంటుందన్నారు కీరవాణి.
స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి చిరంజీవి అని, నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తాడని, ఆయనలో తనకు నచ్చే గొప్ప క్వాలిటీ స్నేహం అని, స్నేహం వల్లే ఎంతో గొప్ప మేలు జరుగుతుంది. దేశాల మధ్య యుద్ధాలనే ఆపేయగలం. స్నేహం అనేది మామూలు విషయం కాదు. చిరంజీవి స్నేహానికి చాలా ప్రయారిటీ ఇస్తారని చెప్పారు కీరవాణి.