యాదాద్రి, పోచంపల్లి లో మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్ సందడి

Published : May 16, 2025, 11:30 AM IST
యాదాద్రి, పోచంపల్లి లో మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్ సందడి

సారాంశం

తెలంగాణలో ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు...మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ కు వచ్చిన వివిద దేశాల సుందరీమణులు ఇక్కడి ప్రాంతాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లు ప్రత్యేక పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూదాన్ పోచంపల్లిలో ఉన్న చేనేత పరిశ్రమను కూడా పరిశీలించారు.

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించగా, ఆలయ అధికారులు వారి కోసం ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, వారు తాంబాలంలో ఉంచిన పవిత్ర నీటితో తమ కాళ్లను కడుక్కుని, నరసింహస్వామికి నమస్కరించారు. పూజ అనంతరం ఆలయ విభిన్న విభాగాలను వీక్షించారు.

యాదాద్రి పర్యటన తరువాత వారు భూదాన్ పోచంపల్లికి వెళ్లి అక్కడి చేనేత కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు పట్టుగూళ్ళ నుండి దారం తయారీ, చిటికీ కట్టడం, రంగులు అద్దడం, పంటెలు తిప్పడం, రాట్నంతో కండెలు వడకడం, మగ్గం నేయడం తదితర వస్త్ర తయారీ ప్రక్రియలను గమనించారు. వారు ప్రముఖ ఇక్కడి చీరలను కూడా పరిశీలించారు.

మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వారి పర్యటనను తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణ చేనేత వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశం ఏర్పడింది.

మొత్తంగా, మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్ల ఈ పర్యటన ద్వారా యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి చేనేత కేంద్రాలు విశేషంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాయి.

PREV
Read more Articles on
click me!