Sirivennela Death : పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.. సిరివెన్నెలకు హరీశ్ రావు నివాళి

By Siva KodatiFirst Published Dec 1, 2021, 12:35 PM IST
Highlights

అనారోగ్యంతో మరణించిన ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధివ దేహానికి తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు (harish rao) నివాళులర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. పండితులను, పామరులను మెప్పించగలిగిన గొప్ప వ్యక్తిత్వం సిరివెన్నెల సొంతమని హరీశ్ రావు ప్రశంసించారు. 

అనారోగ్యంతో మరణించిన ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధివ దేహానికి తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు (harish rao) నివాళులర్పించారు. అనంతరం సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. పండితులను, పామరులను మెప్పించగలిగిన గొప్ప వ్యక్తిత్వం సిరివెన్నెల సొంతమని హరీశ్ రావు ప్రశంసించారు. 

సినిమా పాటలైనా అశ్లీలత, ద్వంద అర్థాలకు తావు లేకుండా పాటలు రచించారని మంత్రి కొనియాడారు. తెలుగు సినిమా రంగంలో సీతరామశాస్త్రి తెలియని వారు ఉండరని అన్నారు. సినిమా పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన గొప్ప వ్యక్తని..  ఆయన మరణం మనందరికీ ఎంతో దుఃఖాన్ని కలిగించిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామ శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను  అని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా.. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

ALso Read:Sirivennela: నేను సాగిలపడి నమస్కరించే వ్యక్తి ఆయన.. సిరివెన్నెలకు బన్నీ, ఎన్టీఆర్,పవన్, మహేష్ నివాళి

దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. Sirivennela Seetharama Sastry Dead మరణంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌ కి గురైంది. మే 20, 1955న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో డాక్టర్‌ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి గార్లకి సిరివెన్నెల జన్మించారు. అనకాపల్లిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియన్‌ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో బి.ఏ పూర్తి చేశారు. ఎం.ఏ చేస్తుండగా, ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు కె.విశ్వనాథ్‌.. `సిరివెన్నెల` సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. అలా 1986లో సిరివెన్నెల కెరీర్‌ ప్రారంభమైంది. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కానీ తొలి చిత్రం `సిరివెన్నెల`నే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. 

మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాశారు సిరివెన్నెల. `విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` సిరివెన్నెల రాసిన తొలిపాట. చివరగా ఆయన అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో `చిట్టు అడుగు` అనే పాటని రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటలరచయిత మాత్రమే కాదు, కవి, సింగర్‌ కూడా. `గాయం` సినిమాలో `నిగ్గ దీసి అడుగు.. `అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. జనాన్ని చైతన్య పరిచే ఈ పాట ఊర్రూతలూగించింది. గాయకుడిగా సిరివెన్నెలలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. 

click me!