
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ కి ఒక రోజు ముందే పండగ వాతావరణం మొదలయింది. ఆగష్టు 22న చిరంజీవి 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం చిరు ఆచార్య, లూసిఫెర్ రీమేక్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తదుపరి చిత్రాల అప్డేట్స్ బర్త్ డే కానుకగా రెడీ అవుతున్నాయి.
లూసిఫెర్ రీమేక్ తర్వాత చిరు.. డైరెక్టర్ బాబీ, మెహర్ రమేష్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించనుండడం అధికారికంగా ఖరారైంది.
'మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ని మెగా వేలో సెలెబ్రేట్ చేసుకుందాం. ఎ ఫిల్మ్ బై మెహర్ రమేష్' అని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రకటించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆగష్టు 22న ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నారు.
మెహర్ రమేష్, చిరు చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మెహర్ రమేష్ కు సరైన సక్సెస్ లేదు. మెహర్ రమేష్ చివరగా తెరకెక్కించిన షాడో మూవీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ కమర్షియల్ అంశాలతో చిత్రాన్ని బాగా డీల్ చేస్తారనే గుర్తింపు మెహర్ రమేష్ కు ఉంది. అలాంటి మెహర్ రమేష్ కు చిరంజీవి ఛాన్స్ ఇచ్చారంటే.. కథ బలంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.