ఇండస్ట్రీ బాగుండాలంటే డైరెక్టర్స్ బాధ్యత తీసుకోవాలి.. నిర్మాతలను బతికించాలి: చిరంజీవి

By Sumanth KanukulaFirst Published Jan 14, 2023, 5:38 PM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్స్ సినిమా ఒకే అనున్న తర్వాత నిర్మాతలకు అనుకున్న సమయానికి, బడ్జెట్‌లో  సినిమా పూర్తి చేయడం మొదటి సక్సెస్‌గా భావించాలని అన్నారు.

ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం చిరంజీవి తాజా చిత్ర వాల్తేరు వీరయ్య మెగా మాస్ బ్లాక్‌బాస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..  డైరెక్టర్స్ సినిమా ఒకే అనున్న తర్వాత నిర్మాతలకు అనుకున్న సమయానికి, బడ్జెట్‌లో  సినిమా పూర్తి చేయడం మొదటి సక్సెస్‌గా భావించాలని అన్నారు. కొత్త టెక్నాలజీకి ఏదైనా వస్తే దానిని వాడటం కోసం అర్రులు చాచే కంటే.. ఒక మాములు కెమెరాతో కూడా వాళ్ల దగ్గర ఉన్న కథ పవర్‌తో అత్యద్భుతమైన సినిమా తీస్తామని అనుకోవాలని సూచించారు. 

అత్యాధునిక ఎక్విప్‌మెంటే కావాలని కోరుకూడదని.. అవన్నీ యాడెడ్ అని చెప్పారు. అయితే అవసరం మేరకు తీసుకోవాలని అన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుంటే బోలెడంతా ఖర్చు కూడా పెరిగిపోతుందన్నారు. దేనికైనా సరే అని నిర్మాతలు ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుందని చెప్పారు. 

ఇండస్ట్రీ బాగుండాలంటే మొదటగా బాధ్యత తీసుకోవాల్సింది  డైరెక్టర్స్ అని అన్నారు. ఈ విషయం డైరెక్టర్స్ గుర్తెరగాలని చెప్పారు. సబ్జెక్ట్‌కు తగ్గట్టు డబ్బులు ఖర్చు చేయాలని సూచించారు. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పిన మాటలు కావని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ విస్తృత ప్రయోజనాల కోసం తాను ఒక చిన్న సలహాగా ఈ మాట చెబుతున్నానని అన్నారు. నిర్మాతలను దర్శకులు బతికించాలని, వారికి భుజం కాయాలని చెప్పారు. నిర్మాతలు బాగుంటేనే సినీ పరిశ్రమ బాగుంటుందని అన్నారు. 

ఇక, వాల్తేరు వీరయ్య చిత్ర విజయం సినిమాకు పనిచేసిన కార్మికులదని చిరంజీవి అన్నారు. కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలని కోరారు. సినీ కార్మికుల కష్టం అందరూ తెలుసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకులకు థాంక్స్ చెప్పక్కర్లేదని.. మంచి సినిమా ఇచ్చినందుకు వాల్లే థాంక్స్ చెబుతున్నారని అన్నారు. 

click me!