
లాస్ట్ ఇయిర్ కార్తికేయ2 తో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్, ఆ తర్వాత డిసెంబర్‌లో వచ్చిన 18 పేజెస్ తో బాక్సాఫీస్ వద్ద జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న సినిమా స్పై. కెరీర్ లో మొదటిసారి నిఖిల్ గూఢచారిగా నటించిన ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడింది. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ప్రీ రిలీజ్ పంక్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ 27 న జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఈ ఈవెంట్ భారీగా జరగనుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం (డెబ్యూ) వహిస్తున్నాడు. ఐశ్వర్యా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
స్పై జులై 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్ (SPY Trailer)లో చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు. దాస్తుంది..దానికి సమాధానం మనమే వెతకాలి.. అంటూ సాగే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. నేతాజీ ఫైల్స్, మరణం మిస్టరీని చేధించే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పాడు డైరెక్టర్.
ఈ యాక్షన్ థ్రిల్లర్ ని మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ ప్లాన్ చేశారు. కొంత కీలక భాగం విదేశాల్లో కూడా షూట్ చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ మూవీ కోసం ఎంతోమంది ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.