
సీనియర్ హీరోల్లో రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఐదారు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలు ‘ఖిలాడీ’,‘రామారావు ఆన్ డ్యూటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘ధమాకా’(Dhamaka) హడావిడిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తూనే.. మరోవైపు సుధీర్ వర్మతో 'రావణాసుర' ప్రాజెక్టును కూడా పరిగెత్తిస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘రావణాసుర’ సినిమాని నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నిర్మాణంలో మాస్ మహారాజ్ కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ.. షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
దీపావళి సందర్భంగా మాస్ మహారాజ్ అభిమానులకు మేకర్స్ మాస్ అప్డేట్ ను అందించారు. ‘రావణాసుర’ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. దీపావళి సందర్భంగా చిత్రం నుంచి కీలక అప్డేట్ అందడంతో పాటు రవితేజ మాస్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ అలరిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
ఇక ‘రావణాసుర’ చిత్రంలో రవితేజ లాయర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కినేని హీరో సుశాంత్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే రవితేజ, సుశాంత్ ఫస్ట్ లుక్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు మాస్ మహారాజా కూడా ఈ చిత్రంపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చిత్రంలో అననూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ యాక్షన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలు రిలీజ్ అవ్వగా.. మూడో చిత్రంగా ‘ధమాకా’ కూడా రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వచ్చే ఏడాది జనవరి 13న మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’తోనూ అభిమానులను అలరించనున్నారు. మరోవైపు రవితేజ నెక్ట్స్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇలా గ్యాప్ ఇవ్వకుండా సినిమాల్లో నటిస్తూ మాస్ మహారాజ్ బిజీ అయ్యారు.