మణిరత్నంని ఇంతకన్నా బాధించే విషయం ఏముంటుంది?

By AN TeluguFirst Published May 4, 2019, 3:48 PM IST
Highlights

నవాబ్ చిత్రంతో ఫామ్ లో కి వచ్చాడనుకున్న మణిరత్నాన్ని అదృష్టం ఇంకా వెక్కిరిస్తునే  ఉంది.

నవాబ్ చిత్రంతో ఫామ్ లో కి వచ్చాడనుకున్న మణిరత్నాన్ని అదృష్టం ఇంకా వెక్కిరిస్తునే  ఉంది. ఆయన ఎంత కష్టపడి ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కిద్దామని ప్రయత్నం చేసినా పాదరసంలా ప్రక్కకు జారుకుంటోంది. దాదాపు నాలుగేళ్లుగా ఆయన ఒకే సబ్జెక్ట్ పై పనిచేస్తున్నారు. దాదాపు తన కెరీర్ చివర్లో చేసే సినిమాగా దీన్ని భావిస్తున్నారు. అందుకోసం రకరకాల ఇబ్బందులు పడి ప్రాజెక్టు సెట్ చేసుకున్నారు.

విక్రమ్, జయం రవి, అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్, మోహన్‌బాబు వంటి వివిధ భాషల అగ్రతారలును సీన్ లోకి తెచ్చారు. అయితేనేం నిర్మాత చేతులెత్తేయటంలో ప్రాజెక్టు ఆగిపోయిందని సమాచారం. వివరాల్లోకి వెళితే... తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం ఓ  చిత్రాన్ని రూపొందించాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు.

రాజరాజ చోళుల కథతో తయారయ్యే ఈ చిత్రం టెక్నికల్ గా  హై స్టాండర్డ్స్ తో నిర్మించాలని అనుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు భారీ వ్యయం అవుతుందని అంచనా వేసారు.  మణి స్టైల్‌ లో రూపొందనున్న ఈ సినిమాకు సంతోష్ శివన్‌ సినిమాటోగ్రఫి అందిస్తుండగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్, లైకా సంస్థ భాగస్వామ్యంలో మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసారు. 

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైంది. అయితే లైకా ప్రొడక్షన్స్ వారు తాము అంత బడ్జెట్ పెట్టలేమన్నారు. రీసెంట్ గా భారతీయుడు 2 ని సైతం బడ్జెట్ సమస్యలతోనే లైకా ప్రొడక్షన్స్ ఆపేసింది. ఈ నేపధ్యంలో మరో పెద్ద నిర్మాణ సంస్థను సంప్రదించే ఆలోచనలో మణిరత్నం ఉన్నారని  తమిళ సిని వర్గాలు వారు చెబుతున్నారు. 

click me!