శివుని ఆజ్ఞ.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు.. శ్రీవారి సన్నిధిలో తొలిసారిగా స్పందించిన మంచు మనోజ్!

By Asianet News  |  First Published Mar 6, 2023, 4:07 PM IST

పెద్దల అంగీకారం.. ఆశీర్వాదంతో మంచు మనోజ్ -  మౌనిక ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ తన ప్రేమ, పెళ్లి, మౌనికా రెడ్డి కొడుకుపై స్పందించారు. 
 


కొంతకాలంగా ఒకరినొకరు అర్థం చేసుకొని మార్చి3న పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు హీరో మంచు మనోజ్ (Manchu Manoj) - మౌనికా రెడ్డి (Mounika Reddy). మంచు లక్ష్మి వీరి వివాహానికి పెద్దగా వ్యవహరించారు. పెళ్లి, తదుపరి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ జంట తాజాగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ఈజంట ఆలయ ప్రాంతంలో మీడియా కంట పడింది. ఈ సందర్భంగా మనోజ్ తొలిసారిగా తమ ప్రేమ, పెళ్లి, మౌనికా రెడ్డి కొడుకు పైనా కూడా స్పందించారు.

మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు.. మౌనికాకు పెళ్లి జరిగి వాళ్ల ఇంటి నుంచి ఈరోజు తిరుమలకు వచ్చాం. ఈ సందర్భంలో ఒకటి చెబుతున్నాను. లైఫ్ లో ఏదైనా ఓడిపోవచ్చుగానీ ప్రేమ ఓడిపోవద్దని నమ్ముతున్నాను. ఈరోజు ప్రేమే గెలిచింది. మా నాన్నగారి ఆశీస్సులు, మా అక్క సపోర్ట్ తో మేమిద్దరం ఒక్కటయ్యాం. మమ్మల్ని దీవించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.’ అని చెప్పారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ తన పెళ్లి సందర్భంగా ‘శివుడి ఆజ్ఞ’ అంటూ పెట్టిన పోస్ట్ పైనా ప్రశ్న ఎదురైంది. 

Latest Videos

దీనిపై స్పందిస్తూ..  ‘శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా పుట్టదు. 12 ఏండ్లుగా మౌనికా నాకు స్నేహితురాలిగా తెలుసు. గత నాలుగేండ్లుగా ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొన్నాం. మౌనికా బాబు గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నాం. ఎలాగైనా మంచి జీవితంకోసం ముందుకెళ్లాలని భావించాం. శివుడి ఆశీస్సులతో అందరూ ముందుకొచ్చి మా పెళ్లి చేశారు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తారంటారు.. బహూశా అది ఇదేనేమో’ అంటూ మౌనికా రెడ్డి కొడుకు ధైరవ్ రెడ్డి బాధ్యతలను తీసుకుంటున్నట్టుగా వ్యాఖ్యానించారు. అది శివుడి ఆజ్ఞగా భావిస్తున్నట్టు తెలిపారు. అందుకే అప్పుడు అలా పోస్ట్ పెట్టినట్టు క్లారిటీ ఇచ్చారు. 

అలాగే.. తను రాజకీయాలకు దూరంగానే  ఉంటానని, ప్రజా సేవ మాత్రం చేస్తానన్నారు.  ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటానని అన్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై అలరించబోతున్న మనోజ్ తన తదుపరి చిత్రం ‘వాట్ ది ఫిష్’పైనా స్పందించారు. దేవుడి దయ వల్ల మళ్లీ కేరీర్ ను రీస్టార్ట్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ‘వాట్ ది ఫిష్’ షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలిపారు. డార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి వరుణ్ కోరుకుండ దర్శకత్వం వహిస్తున్నారు. 6ఐఎక్స్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు  రానుందని తెలుస్తోంది. 

 

శివుని ఆజ్ఞ 🙏🏼❤️ pic.twitter.com/U5hQ5V9xqL

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1)
click me!