
ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అని రోజూ పెద్ద పెద్ద లెక్చర్లు వింటుంటాం. అది నేను కూడా విన్నాను. కానీ ఇక్కడ కొందరు తొక్కేస్తున్నారు. ఎవడెవడు తొక్కేస్తున్నాడో అన్నీ చూస్తున్నా. వాళ్లందర్నీ ఒకరోజు వచ్చి అడుగుతా.. అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా మంచు మనోజ్ హీరోగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. పద్మజ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యానర్‌పై ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా ఒక్కడు మిగిలాడు చిత్రాన్ని నిర్మించారు.
ఈవెంట్ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే చాలా కదిలిపోయాను. సినిమా కోసం ముందు లావెక్కాలి అన్నారు. తర్వాత తగ్గాలి అన్నారు. ఓపక్క నాకు షోల్డర్ ఇంజురీ, నెక్ ఇంజురీ ఉన్నాయి. ఎంతో కష్టపడ్డాను. కాబట్టే దర్శకుడిని నమ్మేసి బావిలో దూకేశాను. ఆయన హ్యాపీగా మా అందరినీ మెప్పించే విధంగా సినిమా తీశారు అని మనోజ్ తెలిపారు. అంతేకాక వీడికి పెళ్లయాక మారిపోయాడని సన్నిహితులంతా అనుకుంటున్నారు కానీ అది నిజం కాదని మనోజ్ తెలిపాడు. డైరెక్టర్ అజయ్ ఆండ్రూస్ నూతక్కి మమ్మల్ని సినిమా సెట్లో అలా ఒక మూడ్ లోకి తీసుకెళ్లారు. సెట్లో కామెడీ లేదు, ఏమీ లేదు. రెండేళ్ల క్రితం ప్రెస్ వాళ్లుగానీ, మిత్రులుగానీ నన్ను చూస్తే ఎక్కడికెళ్లినా కౌంటర్లు వేసేవాడిని, అల్లరి చేసేవాడిని. అది మారింది. పెళ్లయి మారాడని అంతా అనుకుంటున్నారు కానీ... ఈ సినిమా కథ, షూటింగ్ ఇలా ప్రతీ విషయంలో పనిచేస్తున్న సమయంలోనే ఈ డైరెక్టర్ నా జీవితాన్ని అలా మార్చేశాడు. రెండేళ్ల నుండి అదే మూడ్లో ఉన్నానని మనోజ్ అన్నాడు.
ఇక జీవితం ఇచ్చిన సంపాదనంతా తీసుకోకుండా తోచినంతగా ఇతరులకు సాయపడాలనేది తన ఆలోచనన్నారు. ఫార్మర్స్ అంత ఇబ్బంది పడుతున్నారు. సంపాదించి అంతా ఏం చేస్తున్నాను అనే ఆలోచనలతో నా ప్రతి సినిమా నుండి 10 శాతం ఫార్మర్స్ కు ఇస్తానని మాట ఇచ్చాను. అది జరుగుతోందని మనోజ్ స్పష్టంచేశారు.
నేను చాలా సెన్సిటివ్. పెద్ద వాళ్లు చిన్నవాళ్లను తొక్కడం ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉంది. అది ఆనవాయితీ అయిపోయింది. అది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఫార్మర్స్ చూస్తే ఆ ఇష్యూ ఉంది. మరొకటి చూస్తే మరో ఇష్యూ ఉంది. మా ఇండస్ట్రీని చూస్తే చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే వాడి ప్రాణం పోతోంది. ఇవన్నీ సమస్యలు ఎందుకొస్తున్నాయి. అందరూ సమానం అంటున్నారు ఎందుకిలా జరుగుతుంది, ఆ ఉద్దేశ్యంతోనే బాధేసి బాధేసి ఛీ ఈ సినిమాలొద్దురా జనాల్లోకి వెళ్లిపోదాం అని డిసైడ్ చేసుకున్నాను.
నా మనసులోని ఆలోచన గురించి ఎవరికీ చెప్పుకోలేదు. ఏమని చెప్పుకుంటాం? నేను సమాజం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నానురా... హెల్ప్ చేయండని అడిగితే నవ్వుతున్నారు. మనందరికీ పది మందికి హెల్ప్ చేయాలనే అలవాటే అసలు పోయింది. నేను పదిమందికి హెల్ప్ చేయాలనుకున్నాను. ఇది వద్దనుకుని అటు వెలుతున్నాను. అందుకే సినిమా అంటే నాకు ప్రాణం. నా ఊపిరి. నాకు చదువులేదు. సినిమా లేకుంటే మంచి కారు డ్రైవర్ అవుతాను. లేదా బాక్సర్ అవుతాను. అంతకంటే ఏమీ కాలేను అంటూ మనోజ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. అందుకే బాధతో సినిమాలకు గుడ్ బై అంటూ ట్వీట్ చేశానన్నాడు.
అయితే అప్పుడు అలా ట్వీట్ చేయడంతో మా అన్న కంగారుపడిపోయి ఇంటికొచ్చి నా డాష్ మీద ఓ తన్ను తన్నారు. ఏంట్రా నీ సొంత డెసిషన్లు. ఇంత మంది ఉన్నాము. ఇలా చేస్తున్నావు అంటూ నా ఫోన్ లాక్కున్నారు. నా వైఫ్ గానీ, మా నాన్నగానీ మా ఇంట్లోగానీ ఒక్క మాట అనలేదు. మా నాన్నగారు అలా పెంచినదాని వల్లే వీడు ఇలా అయ్యాడని వారికి తెలుసు కాబట్టి వారు నన్ను అడగలేదు.. అని మనోజ్ తెలిపారు.
విష్ణు అన్న అనేది ఒకటే. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. నువ్వు కొద్దిరోజులుగా ఎలాగో ఉన్నావని నాకు తెలుసు. ఇది మంచి ఉద్దేశ్యమే. లైఫ్ లో పది మందికి హెల్ప్ చేస్తావు. పైకి వస్తావు. నీ లైఫ్, నీ కెరీర్ నీ ఇష్టం. కానీ పది రూపాయలు సంపాదిస్తేనే పది మందికి హెల్ప్ చేయగలుగుతావు. అది చూసుకుంటూ ఇది చేస్కో. ఒక రోజు సమయం వస్తుంది. ఆ రోజు మాట్లాడుదువురా అన్నారు. అన్నయ్య మాటకు మర్యాద ఇచ్చి మళ్లీ ఒప్పుకున్నానని మనోజ్ అన్నాడు.
ఏదో ఒక రోజు అనుకున్నది స్టార్ట్ చేసి వచ్చేస్తాను. వచ్చి ఆ రోజు డెఫనెట్‌గా ఈ రోజు ఎవడెవడు పైన కూర్చుని చిన్న వాళ్లను తొక్కుతున్నాడో, ప్రతి ఒక్కరినీ నా తల్లిదండ్రుల సాక్షిగా నోట్ చేసుకుంటున్నాను. తప్పకుండా వస్తా, ఆరోజు ఆడుగుతా. సమాధానం రెడీ చేసుకోండి. సమాధానం చెప్పలేకుంటే.. చెప్పిస్తా, కక్కిస్తా.. అంటూ మనోజ్ ఆవేశంగా మాట్లాడారు.
నేను ఏ కోతి వేషాలు వేసినా, ఎలాంటి సినిమా తీసినా నా వెన్నంటే ఉంటూ, నన్ను కాపాడుకుంటూ, నన్ను డిసప్పాయింట్ చేయకుండా ముందుకు తీసుకెలుతున్న ఫ్యాన్స్ కి థాంక్స్. ఈ సినిమా ఒక దయనీయ గాథ, దయచేసి ఒక కమర్షియల్ సినిమాగానో, కామెడీ సినిమా అనుకునో వెళ్లొద్దు. ఫస్టాఫ్ రొమాలు నిక్కబొడిచే యాక్షన్ తో.. సెకండాఫ్ మనసులను కదిలించే ఒక బోట్ జర్నీతో ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఎంతో అద్భుతంగా తీశాడు. ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా అన్నాడు.