
చిరంజీవి హీరోగా మోహన్ రాజా రూపొందించిన 'గాడ్ ఫాదర్' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్వీ ప్రసాద్ - ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చిరంజీవితో పాటు నయనతార .. సత్యదేవ్ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. మలయాళంలో కొంతకాలం క్రితం మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' గా ఆడియన్స్ ముందుకు తీసుకుని వచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.
ఈ నేపథ్యంలో సరైన సినిమా రైట్స్ తెచ్చుకుని తెలుగుకు రీమేక్ చేస్తే వర్కవుట్ అవుతుందని మరో సారి ప్రూవైంది. దాంతో హీరోలు మరోసారి రీమేక్ కు చేయదగ్గ సినిమాలు కోసం పరభాషా సినిమాల వైపు చూస్తున్నారు. తమ నిర్మాతలను అలాంటి సినిమాలు ఉంటే పట్టుకోమని పురమాస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో చిత్రం వాళ్ల కంటబడిందని సమాచారం. ఈ సినిమా రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు ముమ్ముట్టి హీరోగా వచ్చిన అక్టోబర్ 7న వచ్చి సూపర్ హిట్టైన చిత్రం Rorshach’.
ఈ సినిమా ఓ సైక్లాజికల్ థ్రిల్లర్ గా నడుస్తుంది. ఇదో రివేంజ్ థ్రిల్లర్ అని కూడా చెప్పాలి. ఇందులో ముమ్మట్టి లూక్ అంటోనిగా కనపడతాడు. తన జీవితంలో స్టక్ అయ్యిపోయిన మనిషి. పగతో రగిలిపోతూంటాడు. అతను విదేశాల నుంచి వచ్చి తన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. స్పృహ వచ్చి చూశాక పక్కన ఆమె ఉండదు. దీంతో ప్రమాదం జరిగిన అటవీ ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తాడు. ఆమె గురించి తెలిసే దాకా ఆ టౌన్ వదిలి వెళ్ళనంటాడు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ. ఒక్కో మెలిక విడే క్రమంలో రకరకాల అనుభూతులు,అనుభవాలు చోటు చేసుకుంటాయి. తర్వాత ఎన్నో షాకింగ్ సంఘటనలు జరుగుతాయి. అవి ప్రేక్షకుడుని కూర్చోబెడతాయి. ఈ సినిమా రైట్స్ కోసం మన నిర్మాతలు ఉత్సాహపడుతున్నట్లు సమాచారం. ఎక్కువ రేటే చెప్తున్నారని, త్వరలోనే ఓ పెద్ద హీరోతో రీమేక్ చేసే అవకాసం ఉందని అంటున్నారు. ఆ హీరో చిరంజీవి లేక నాగార్జున అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ముమ్మట్టి కథలు సీనియర్ హీరోలకే సెట్ అవుతాయి.
ఇదిలా ఉంటే..చిరంజీవి మరో మలయాళ సినిమా రీమేకులో చేయనున్నట్టుగా సమాచారం. ఆ సినిమా పేరే 'భీష్మ పర్వం'. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. అక్కడ సక్సెస్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా రీమేకులోనే చిరంజీవి చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.