
మహర్షి మూవీలో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించే వృద్ధ రైతు పాత్ర ఎవరూ మర్చిపోలేరు. కథను మలుపు తిప్పే, హీరో ఆలోచనా విధానం మార్చేసే ఆ చిన్న పాత్రను గురు స్వామి అనే నటుడు చేశారు. 'తాతా నాకు వ్యవసాయం నేర్పుతావా...' అని మహేష్ ఆ రైతును అడగడం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. ఆ వృద్ధ రైతు పాత్ర చేసిన గురు స్వామి ఇకలేరు. గురు స్వామి కన్నుమూసినట్లు సమాచారం అందుతుంది.
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గురు స్వామి తుదిశ్వాస విడిచారు. మహర్షి సినిమాతో పాటు ఏ వన్ ఎక్స్ ప్రెస్, వకీల్ సాబ్ చిత్రాల్లో గురు స్వామి నటించారు. గురు స్వామి మరణవార్త తెలుసుకున్న చిత్ర వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాయి.
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురు స్వామి నటనపై మక్కువతో రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కూడాను. విజేత ఆర్ట్స్ పేరుతో బ్యానర్ స్థాపించి నాటికలు, నాటకాలు నిర్మించారు. ఆయుష్మాన్ భవ అనే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించడం ద్వారా గురు స్వామి వెలుగులోకి వచ్చాడు.